పుట్టపర్తి నియోజక వర్గంలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు.
పుట్టపర్తి అర్బన్/ఓడీచెరువు/ బుక్కపట్నం : పుట్టపర్తి నియోజక వర్గంలో ఆదివారం ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. పుట్టపర్తి మండలం బొంతలపల్లికి చెందిన కొంతమంది అడవిలోని ట్రాన్స్‌పార్మర్ నుంచి ఇనుప తీగలను కిలోమీటర్ల మేర పొడవునా వేసి వేటాడేవారు.
అందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అడవి జంతువులను వేటాడం కోసం ఓడీసీ మండలం శేషయ్యగారిపల్లికి వలస వెళ్లిన కంబాలపర్తి వేమనారాయణనాయక్(35) కరెంటు తీగలపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ రాఘవరెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.
పండుగ పూట విషాదం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుక్కపట్నం మండలం జానకంపల్లిలో గ్రామస్తులు స్థానిక పెద్దమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో గుడి వద్ద విద్యుత్ దీపాలంకరణ చేశారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ దీపాలకు కరెంటు సరఫరా కావడంతో గ్రామానికి చెందిన కురబ నాగభూషణ(46) షాక్‌కు గురైయ్యాడు. వెంటనే అతడికి పుట్టపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు బంధువు తెలిపారు.