రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Published Thu, Oct 6 2016 10:03 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
అతివేగం.. నిర్లక్ష్యం..ఆపై నిద్రమత్తు క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. మరో పదిహేను మంది క్షతగాత్రులయ్యారు.. కేతేపల్లి మండల పరిధి ఉప్పలపహాడ్ శివారులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇవే కారణాలు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి.
– కేతేపల్లి
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన లక్సరీ బస్సు 38 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి హైద్రాబాద్ నుంచి బయలుదేరింది. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ శివారులో గల హోటల్9 సమీపంలోకి చేరుకోగానే ఇంజన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఈ క్రమంలో వెనకాలే వస్తున్న శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన లారీ బస్సును వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు దాదాపు వంద అడుగుల దూరం వరకు ముందుకు వెళ్లి రోడ్డు పక్కకు మూడు ఫల్టీలు కొట్టింది. ఇక ప్రమాదానికి కారణమైన లారీ ముందు భాగం నుజ్జునుజ్జయి రోడ్డుపైనే ఫల్టీ కొట్టింది. ఈప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటేశ్వర్లు(42), ఆయన తల్లి రుక్మిణమ్మ(65)లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య నాగలక్ష్మి, లారీడ్రైవర్ విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, వేములపాలెం గ్రామానికి చెందిన ఏర్పుల బాలస్వామి, బస్సులో ప్రయాణిస్తున్న కిరణ్‌కుమార్, కె.అజయ్,సతీష్, మదన్, గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి(జంగారెడ్డిగూడెం), సీహెచ్.వెంకట్‌రెడ్డి(జలపరివారిగూడెం), లక్ష్మారెడ్డి(హైదరాబాద్), మోక్షశ్రీ, జె.స్వాతి,రవితేజ, (సత్తుపల్లి), ఎన్.పద్మ(అశ్వారావుపేట)లకు తీవ్ర గాయాలయ్యాయి.
రేషన్ కార్డుకోసం వేళ్తూ మృత్యు ఒడికి
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వెంకటేశ్వరావు,రుక్మిణమ్మలు హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణ సుతారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో అక్కడి ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డులకు ఫొటోలు, వేలిముద్రలు నమోదు చేసేందుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్‌ఐ మద్దెల కృష్ణయ్య సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే 1033, 108 అంబులెన్స్‌లలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి రోడ్డుపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య నాగలక్ష్మి పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.
Advertisement
Advertisement