kethepalli
-
గోదాములకు మంత్రి హరీశ్ భూమి పూజ
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసిన ధాన్యం రాశులే కన్పిస్తున్నందుకు చాలా ఆనందగా ఉంది. జిల్లా ధాన్యం కొనుగోల్లలో నంబర్ వన్ స్థానంలో ఉంది. డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నీరిచ్చాం. సాగర్ కింద వారబందితో రైతులకు నీరందించాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు చేసే ప్రతి రైతుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తాం. మరికొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద రైతులకు సాగు నీరు ఇస్తాం. నకిరేకల్‌లో నెల రోజుల్లో నిమ్మ మార్కెట్ ప్రారంభిస్తాం. నల్లగొండలో బత్తాయి మార్కెట్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని అన్నారు. -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
భీమారం(కేతేపల్లి) : కేతేపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ సూర్యాపేట–మిర్యాలగూడెం రహదారిపై శనివారం మండలంలోని భీమారం గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సూర్యాపేటకు కేవలం 15 కి.మీ దూరంలో ఉన్న కేతేపల్లి మండలాన్ని నల్లగొండ జిల్లాలో కొనసాగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన 80 శాతం మంది విద్యార్థులు సూర్యాపేటలోని పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుతున్నారని పేర్కొన్నారు. రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ మద్దెల క్రిష్ణయ్య సిబ్బందితో భీమారం గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామస్తులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ధర్నాలో ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు సుక్క వినయ్‌సాగర్, బడుగుల చంద్రశేఖర్, అవిరెండ్ల రమేష్, కూరెళ్ల వెంకన్న, ఆదాం, గునగంటి రాము, రహీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్య సంపదను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
చెర్కుపల్లి(కేతేపల్లి) : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి డెప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మూడు లక్షల చేపపిల్లలను ఆదివారం మండలంలోని చెర్కుపల్లి ఉదయసముద్రం, దీపకుంట చెరువులలో ఆయన వదిలి మాట్లాడారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్యసంపదపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బంటు మహేందర్, సొసైటీ చైర్మన్ లింగాల రాంనర్సయ్య, నాయకులు పీబీ ఎల్లయ్య, అంజాద్‌ఖాన్, పులుసురాజు, మల్లం సైదులు, ఎ.మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తిరైతు ఆత్మహత్య
అతివృష్టి పరిస్థితులు మరో రైతును బలితీసుకున్నాయి. అప్పు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించినా..వరుణుడు నిండా ముంచడంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఓ వైపు అప్పుల వారి ఒత్తిళ్లు.. మరో వైపు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోయాడు. చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. కేతేపల్లి మండలం కొండకిందిగూడెంలో శనివారం ఈ విషాదకర ఘటన వెలుగు చూసింది. – కేతేపల్లి మండల పరిధిలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన అల్లి లింగయ్యయాదవ్(77) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమికి తోడు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట సాగు చేశాడు. పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద రూ.2లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో పాటు గతంలో చేసిన రూ.2.5 లక్షల అప్పు అలాగే ఉండిపోయింది. అంతా సవ్యంగా సాగితే తాను చేసిన అఫ్పులన్నీ తీరుతాయని లింగయ్య భావించాడు. అయితే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తిపంట జాలువారి ఎర్రగా మారింది. పంటసాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక లింగయ్య మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసే సరికి అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లింగయ్య మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ డి.సాయిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోట పుల్లయ్య, కాంగ్రెస్ నాయకులు జటంగి వెంకటనర్సయ్యయాదవ్, ఎండీ.యూసుఫ్‌జానీ, మారం వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ధర్మారెడ్డి, ఎ.రవీందర్‌రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు. లింగయ్య కుటుంబానికి ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
అతివేగం.. నిర్లక్ష్యం..ఆపై నిద్రమత్తు క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. మరో పదిహేను మంది క్షతగాత్రులయ్యారు.. కేతేపల్లి మండల పరిధి ఉప్పలపహాడ్ శివారులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇవే కారణాలు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. – కేతేపల్లి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన లక్సరీ బస్సు 38 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి హైద్రాబాద్ నుంచి బయలుదేరింది. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ శివారులో గల హోటల్9 సమీపంలోకి చేరుకోగానే ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఈ క్రమంలో వెనకాలే వస్తున్న శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన లారీ బస్సును వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు దాదాపు వంద అడుగుల దూరం వరకు ముందుకు వెళ్లి రోడ్డు పక్కకు మూడు ఫల్టీలు కొట్టింది. ఇక ప్రమాదానికి కారణమైన లారీ ముందు భాగం నుజ్జునుజ్జయి రోడ్డుపైనే ఫల్టీ కొట్టింది. ఈప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటేశ్వర్లు(42), ఆయన తల్లి రుక్మిణమ్మ(65)లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య నాగలక్ష్మి, లారీడ్రైవర్ విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, వేములపాలెం గ్రామానికి చెందిన ఏర్పుల బాలస్వామి, బస్సులో ప్రయాణిస్తున్న కిరణ్‌కుమార్, కె.అజయ్,సతీష్, మదన్, గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి(జంగారెడ్డిగూడెం), సీహెచ్.వెంకట్‌రెడ్డి(జలపరివారిగూడెం), లక్ష్మారెడ్డి(హైదరాబాద్), మోక్షశ్రీ, జె.స్వాతి,రవితేజ, (సత్తుపల్లి), ఎన్.పద్మ(అశ్వారావుపేట)లకు తీవ్ర గాయాలయ్యాయి. రేషన్ కార్డుకోసం వేళ్తూ మృత్యు ఒడికి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వెంకటేశ్వరావు,రుక్మిణమ్మలు హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణ సుతారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వగ్రామంలో అక్కడి ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డులకు ఫొటోలు, వేలిముద్రలు నమోదు చేసేందుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ మద్దెల కృష్ణయ్య సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే 1033, 108 అంబులెన్స్‌లలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి రోడ్డుపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య నాగలక్ష్మి పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
మూసీకి తగ్గిన ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 2 క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గురువారం 3700 కూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 2 గేట్ల ద్వారా 2900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వకు 250, కుడి కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ఎన్.రమేష్ తెలిపారు. -
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి: ముసీ రిజర్వాయర్‌కు శనివారం సైతం భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగాంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, బిక్కేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం 30 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మెుత్తం 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 25 వేలకు తగ్గడంతో గేట్లను ఒక అడుగు మేర కిందకు దించారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూస్తు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందడి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : మారుమూల గ్రామాల అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని ఇనుపాములలో శుక్రవారం రూ.13 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆనంతరం నూతనంగా నిర్మించిన గోపాలమిత్ర భవనం, జెడ్పీహెచ్ఎస్లో అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనlప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తుమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల అహాల్యదయాకర్రెడ్డి, ఎంపీటీసీ శైలజసాగర్, ఉపసర్పంచ్ డి.సైదులు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రవీందర్‌రెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
640 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. నాలుగు రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటి మట్టం 645 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 640 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తన్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గిపోయంది. ఎగువ నుంచి కేవలం 1,400 క్యూసెక్ల వరద నీరు రిజర్వాయర్‌లో చేరుతుందని ప్రాజెక్టు ఇంజినీర్ ఎన్.రమేష్ తెలిపారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. -
మూసీనీటితో పంటలు సాగు చేయవద్దు
కేతేపల్లి : మూసీ కుడి, ఎడమ కాల్వలకు వదిలిన నీటితో ఆయకట్టులో రైతులు ఎలాంటి పంటల సాగు చేయవద్దని మూసీ డీఈ నవికాంత్ సూచించారు. ఆదివారం ఆయన మూసీ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. మూసీ రిజర్వాయర్‌లో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు చేరిందన్నారు. తీవ్రమైన కరువు నెలకున్న నేపథ్యంలో ఆయకట్టు పరిధిలోని 42 చెరువులు, కుంటలు నింపేందుకు మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రసుత్తం కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. చెరువులు పూర్తిగా నిండేంత వరకు కాల్వలకు ప్రతిరోజు 250 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. కాల్వలకు విడుదల చేసిన నీటిని వినియోగించి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయవద్దని సూచించారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినట్లయితే ఆయకట్టులో రబీ పంటకు సాగునీరు విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు ఏఈ ఎన్.రమేష్ ఉన్నారు. -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో ఉన్న కేతేపల్లి మండలాన్ని ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో కలిపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మండలాన్ని సూర్యాపేట జిల్లాలో విలీనం చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చేందుకు మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కేతేపల్లిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమంలో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున ప్రజలతో నల్లగొండకు వెళ్లి జిల్లా కలెక్టరేట్‌కు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి మండల ప్రజలు, మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన జె.వెంకటనర్సయ్యయాదవ్, కోట మల్లికార్జునరావు, కోట పుల్లయ్య, కె.ప్రదీప్‌రెడ్డి, ఎ.జోగిరెడ్డి, కోట లింగయ్య, చందా రామ్మూర్తి, బి.జాన్‌రెడ్డి, కోట సంపత్‌రావు, ఎన్.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత జలాశయంగా మూసీ
కేతేపల్లి : కృష్ణా, గోదావరి జలాలను మూసీ రిజర్వాయర్‌లోకి తీసుకువచ్చి శాశ్వత జలాశయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్టు కుడి కాల్వల ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో చెరువులు, కుంటలను మూసీ నీటితో నింపేందుకు ఆదివారం ఆయన కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆయకట్టు గ్రామాల్లో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిని తీర్చేందుకే గ్రామాల చెరువులు, కుంటలు నింపాలని నిర్ణయించామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎలాంటి ముంపు లేకుండా మూసీ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మూసీ ప్రధాన, డిస్టిబ్యూటరీ కాల్వలు, తూముల మరమ్మతులకు సర్వే చేయించి రు.56 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కాల్వలో దట్టంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కంపచెట్లను ఈజీఎస్‌లో తొలగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, మూసీ డీఈ నవికాంత్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కాల్సాని లింగయ్య, కె.వెంకటరమణ, బి.యాదగిరి, ఎంపీటీసీ ఆర్.యాదగిరి, కుడి కాల్వ ఏఈ ఎన్.రమేష్, ఎడమ కాల్వ ఏఈ, జేఈ మమత, స్వప్న, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులకు నిధులు కేటాయించాలి
కొండకిందిగూడెం (కేతేపల్లి) : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. విషజ్వరాల బారిన పడిన కొండకిందిగూడెం గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి బాధితులను పరామర్శించారు. గ్రామంలో విషజ్వరాలు ప్రబలటానికి గల కారణాలను స్థానికులు, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్న పాఠశాలలో సరైన వసతులు, పరిశుభ్రత లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుతో మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ఇస్తున్నట్లు నిధులు పంచాయతీలకు సరిపోవటం లేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై గ్రామీణ ప్రజలకు అవగాన కల్పించాలని కోరారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ డి.సాయిరెడ్డి, నకిరేకల్ సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోట పుల్లయ్య, నాయకులు మారం చెన్నకృష్ణారెడ్డి, జటంగి వెంకటనర్సయ్యయాదవ్, మారం వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు. -
మిర్యాలగూడ, కేతేపల్లిని ‘పేట’ జిల్లాలో కలపాలి
సూర్యాపేటటౌన్ : నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ డివిజన్‌తోపాటు కేతేపల్లి మండలాన్ని కూడా కలపాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెద్దిరెడ్డి రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడను రాజకీయ ఒత్తిళ్ల మేరకు నల్లగొండ జిల్లాలోనే కొనసాగిస్తున్నట్టు ముసాయిదాలో ఉందన్నారు. ప్రస్తుత ముసాయిదా బిల్లు ప్రజలకు అనుకూలంగా లేదని, ప్రజల అభిప్రాయాల మేరకు మిర్యాలగూడ, కేతేపల్లిని సూర్యాపేటలో కలిపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా హక్కుల పరిష్కార వేదిక అధ్యక్షుడు పాల్వాయి జానయ్య, నవీన్, నాగరాజు, వెంకన్న, సైదులు, రాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
చీకటిగూడెం(కేతేపల్లి): మండలంలోని చీకటిగూడెంల శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఆటోను కారు డీకొట్టిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం..మండలంలోని చీకటిగూడెం గ్రామంలో మృతి చెందిన తమ బందువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెన్‌పహాడ్ మండల ధూపహాడ్కు చెందిన 12 మంది మంగళవారం ఆటోలో చీకటిగూడెం బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో చీకటిగూడెం శివారులో గల హోటల్9 ఎదురుగా ఉన్న కల్వర్టుపైకి చేరుకోగానే రోడు సరిగా లేకపోవటంతో ఆటో డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో విజయవాడ నుంచి∙హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు ఆటోను వెనుక నుంచి∙బలంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డుపై ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ధూపహాడ్కు చెందిన మల్లెంల చిలకమ్మ, రాందేని లక్ష్మినర్సమ్మ, దొరగలి చిలకమ్మ, అత్తి లింగయ్య, పిల్లని రాములమ్మ, పి.మట్టయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ ఎం.కృష్ణయ్య సిబ్బందితో కలసి ప్రమాద సంఘటన స్థలం వద్దకు చేరుకున్నాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే 1033 అంబులెన్స్‌లలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన కారు, ఆటోలను జీఎమ్మార్ సిబ్బంది, క్రేన్ సహాయంలో పోలీసులు పక్కకు తొలగించి హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కేతేపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
ఇటుకల లారీ బోల్తా.. మహిళ మృతి
కేతేపల్లి: మండలంలోని ఇనుపాముల శివారు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...లైట్‌వెయిట్ బ్రిక్స్లోడుతో లారీ ఖమ్మం జిల్లా పాలేరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో గల పల్లెరుచులు హోటల్ సమీపంలోకి చేరుకోగానే లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనఫల్టీ కొట్టింది. ఈప్రమాదంలో లారీలోని ఇటుకలపై కూర్చున్న పాలేరుకు చెందిన గోపి రాధిక(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి పోలీసులు, 108 అంబులెన్స్‌లో సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. -
మూసీ కుడికాల్వకు నీటిని విడుదల చేయాలి
కేతేపల్లి(బొప్పారం) : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోకి చేరినందున కుడికాల్వకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమవేదిక(టీయూవీ) జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూవీ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు రైతు ప్రతినిధులు బొప్పారం సమీపంలోని మూసీ కుడికాల్వ గేటు వద్ద కాల్వలోకి దిగి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోనే మూసీ ప్రాజెక్టు ఉన్నప్పటికీ సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఆయకట్టు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నీటిని కాల్వకు వదిలి ఆయకట్టు గ్రామాల చెరువులు, కుంటలు నింపి భూగర్భజల మట్టం పెరిగేలా చూడాలని కోరారు. ఆందోళనలో టీయూవీ నాయకులు, రైతులు నార్కట్‌పల్లి రమేష్, బయ్య క్రిష్ణ, గిన్నె నాగయ్య, చల్ల శేఖర్‌రెడ్డి, బి.జానయ్య, ఉప్పల శంకర్, దుర్గం వెంకన్న, చల్ల వెంకట్‌రెడ్డి, డి.ప్రవీణ్, రజనీకాంత్, శంకర్, డి.సైదులు, శ్రీను, సాయి పాల్గొన్నారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
సూర్యాపేటమున్సిపాలిటీ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన ఆదివారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం యల్లమ్మగూడెం గ్రామానికి చెందిన శ్రావణిని అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి చెందిన లింగయ్యకు 2015లో ఇచ్చి వివాహం చేశారు. లింగయ్య, శ్రావణి దంపతులు సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లింగయ్య పట్టణంలోని ఓ దుకాణంలో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రావణిని కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించసాగుతున్నాడు. శ్రావణి ఇంటి వద్ద పరిస్థితి బాగా లేకపోవడంతో చేసేది ఏమి లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి మృతదేహానికి సోమవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో బంధువులు లింగయ్యపై దాడికి దిగారు. శ్రావణి బంధువుల ఫిర్యాదు మేరకు లింగయ్యపై వరకట్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.