పత్తిరైతు ఆత్మహత్య
పత్తిరైతు ఆత్మహత్య
Published Sat, Oct 8 2016 11:03 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
అతివృష్టి పరిస్థితులు మరో రైతును బలితీసుకున్నాయి. అప్పు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించినా..వరుణుడు నిండా ముంచడంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడాడు. ఓ వైపు అప్పుల వారి ఒత్తిళ్లు.. మరో వైపు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోయాడు. చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. కేతేపల్లి మండలం కొండకిందిగూడెంలో శనివారం ఈ విషాదకర ఘటన వెలుగు చూసింది.
– కేతేపల్లి
మండల పరిధిలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన అల్లి లింగయ్యయాదవ్(77) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమికి తోడు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట సాగు చేశాడు. పెట్టుబడుల కోసం తెలిసిన వారి వద్ద రూ.2లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో పాటు గతంలో చేసిన రూ.2.5 లక్షల అప్పు అలాగే ఉండిపోయింది. అంతా సవ్యంగా సాగితే తాను చేసిన అఫ్పులన్నీ తీరుతాయని లింగయ్య భావించాడు. అయితే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తిపంట జాలువారి ఎర్రగా మారింది. పంటసాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక లింగయ్య మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసే సరికి అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లింగయ్య మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ డి.సాయిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోట పుల్లయ్య, కాంగ్రెస్ నాయకులు జటంగి వెంకటనర్సయ్యయాదవ్, ఎండీ.యూసుఫ్‌జానీ, మారం వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ధర్మారెడ్డి, ఎ.రవీందర్‌రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు. లింగయ్య కుటుంబానికి ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement