సీడు పత్తి రైతు చిత్తు!
సీడు పత్తి రైతు చిత్తు!
Published Wed, Nov 23 2016 11:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– ఖాళీ అగ్రిమెంట్లపై రైతులతో సంతకాలు
– సీడు పత్తిసాగులో 90శాతం కౌలురైతులే
– కంపెనీ ఆర్గనైజర్లకు లక్షల్లో కమీషన్లు
దొర్నిపాడు: సీడు పత్తి రైతును పలు బహుళజాతి కంపెనీలు చిత్తు చేస్తున్నాయి. సీడు గింజలు పాసయితే లక్షలాధికారులవుతారని ఆశచూపి రైతుల కష్టాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాయి. నంద్యాల డివిజన్‌లోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లోనే 80 శాతం సీడుపత్తి సాగువుతోంది. సీడుపత్తి సాగులో మూడు, నాలుగు నెలల కూలీ పనుల కోసం జిల్లా నుంచేగాక తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వందల సంఖ్యలో కూలీలు వలస వస్తారు. వీరికి సదరు రైతులు భోజనంతోపాటు వసతి కల్పించి నెలకు రూ.7వేల నుంచి 8వేలు ఇస్తారు.
రైతులతో ఒప్పందం..
బీటీ విత్తనాల్లో పేటెంట్ అయిన పలు బహుళజాతి సీడు విత్తనాల కంపెనీల యాజమాన్యాలు బీటీ పత్తి విత్తనోత్పత్తి కోసం రైతులకు విత్తనాలు అందిస్తారు. ఖాళీ అగ్రిమెంట్లపై రైతులతో సంతకాలు చేయించుకుంటారు. సీడువిత్తనాలను కంపెనీలు ఆర్గనైజర్లకు అందించడం జరుగుతుంది. ఈ ఆర్గనైజర్లు సీడుపత్తి పండించే రైతులకు కిలో విత్తనాలకు రూ.400నుంచి రూ.440వరకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 వేల దాకా ముందుస్తుగా వడ్డీకి ఇస్తారు. అయితే రైతులు ఎకరాకు పెట్టుబడుల కోసం మరో రూ.లక్ష దాకా ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
దళారీ వ్యవస్థ దోపిడీ..
ఆరుగాలం కష్టించి వేలాది రూపాయలు వెచ్చించి పంట పండిస్తే తీరా పంటచేతికి వచ్చాక మొదలవుతుంది దళారీ వ్యవస్థ. రైతులు పండించిన పత్తిని నంద్యాలకు తీసుకుని ఆర్గనైజర్లకు కంపెనీలు సూచించిన పత్తిమిల్లులోనే పత్తిని జిన్నింగ్ చేసి విత్తనాలు కంపెనీలకు అందించాల్సి ఉంటుంది. స్పిన్నింగ్ మిల్లులో జిన్నింగ్ ఖర్చు రైతు భరించాల్సి ఉంటుంది. జిన్నింగ్‌కు సంబంధించిన మొత్తంలో కంపెనీల ఆర్గనైజర్లకు కమీషన్ రూపంలో ఆదాయం ఉంటుంది. ఇక్కడ రైతు దగాపడతాడు. జిన్నింగ్ చేసిన దూదిని పత్తి వ్యాపారులకు అమ్మితే దాంట్లో కూడా స్పిన్నింగ్ మిల్లులకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక జిన్నింగ్ అయిన తర్వాత క్వింటా విత్తనాలకు 7 కిలోలు తరుగుపేరుతో అదనంగా తీసుకుంటారు.
రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని..
రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. విత్తనాలు పాస్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా అన్నది కంపెనీలు చెప్పిందే రైతులు వినాలి. ప్రభుత్వం, వ్యవసాయ యంత్రాంగం విత్తనాలు పాస్, ఫెయిల్ కావడంపై అవగాహన కల్పించకపోవడంతో ఆర్గనైజర్లు కోట్లు సంపాదిస్తున్నారు. వీరికి కిలోకు రూ.50నుంచి 60వరకు కమీషన్ ఉంటుంది. ఏడాదికి 6 లక్షల కిలోల విత్తనోత్పత్తి జరిగితే కమీషన్ రూ.3 కోట్లు ఉంటుందన్నమాట.
ఫిర్యాదుపై చర్యలు లేవు
కంపెనీలు చేసిన మోసాలకు 10మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే విషయమై గతంలో దొర్నిపాడు మండలంలోని సీడుపత్తి రైతుసంఘం నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ చక్రవర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు.
Advertisement