శాశ్వత జలాశయంగా మూసీ
శాశ్వత జలాశయంగా మూసీ
Published Sun, Aug 28 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
కేతేపల్లి : కృష్ణా, గోదావరి జలాలను మూసీ రిజర్వాయర్‌లోకి తీసుకువచ్చి శాశ్వత జలాశయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్టు కుడి కాల్వల ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో చెరువులు, కుంటలను మూసీ నీటితో నింపేందుకు ఆదివారం ఆయన కాల్వలకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆయకట్టు గ్రామాల్లో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిని తీర్చేందుకే గ్రామాల చెరువులు, కుంటలు నింపాలని నిర్ణయించామని తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎలాంటి ముంపు లేకుండా మూసీ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మూసీ ప్రధాన, డిస్టిబ్యూటరీ కాల్వలు, తూముల మరమ్మతులకు సర్వే చేయించి రు.56 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కాల్వలో దట్టంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కంపచెట్లను ఈజీఎస్‌లో తొలగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, మూసీ డీఈ నవికాంత్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు కాల్సాని లింగయ్య, కె.వెంకటరమణ, బి.యాదగిరి, ఎంపీటీసీ ఆర్.యాదగిరి, కుడి కాల్వ ఏఈ ఎన్.రమేష్, ఎడమ కాల్వ ఏఈ, జేఈ మమత, స్వప్న, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement