చోరీ కేసులో ఇద్దరు దొంగల అరెస్ట్
-
– రూ.1.86 లక్షల బంగారు నగల రికవరీ
బుచ్చిరెడ్డిపాళెం : చోరీ కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.86 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దగదర్తి మండలం చవటపుత్తేడుకు చెందిన గొల్లపల్లి కవిత ఇంట్లో ఈ ఏడాది జూలై 24వ తేదీన దొంగతనం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఊచగుంటపాళెం వద్ద శనివారం చవటపుత్తేడుకు చెందిన శెట్టిపల్లి నందకిషోర్, దువ్వూరు శ్రీనివాసులు అలియాస్ ధర్మ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కవిత ఇంట్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. చోరీ చేసిన బంగారంలో కొంత ముణప్పరం ఫైనాన్స్‌లో కుదువ పెట్టినట్లు ఒప్పుకున్నారన్నారు. దీంతో అక్కడి నుంచి రూ.1.86 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశామని ఆయన తెలిపారు. దగదర్తి ఎస్సై విజయ్‌శ్రీనివాస్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ పి.రవికాంత్, కానిస్టేబుళ్లు మోహన్, ఐ. శేఖర్ పాల్గొన్నారు.