నిందితులను వ్యానులో తరలిస్తున్న పోలీసులు
♦ ఆదివారం చికెన్‌షాపు తెరవడంతో మరోమారు గొడవ
♦ దాడిలో ఇద్దరికి గాయాలు
సాక్షి, నారాయణవనం: సత్యవేడు నియోజకవర్గంలోని నారయణవనం మండలం సముదాయం, కీళగరం దళితవాడల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం సముదాయంకు చెందిన దొరస్వామి, అతని అల్లుడు దినకరన్ నారాయణవనంలోని కీళగరం క్రాస్ వద్ద చికెన్ షాపును తెరిచారు. దీంతో కీళగరం దళితవాడకు చెందిన యువకులు షాపును ధ్వంసం చేసి వారిపై దాడికి పాల్పడారు. ఈ దాడుల్లో దినకరన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, నలుగురు డీఎస్పీలతో పాటు 10 మంది సీఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏఆర్ పొలీసులు, పుత్తూరు సబ్‌డివిజన్‌లోని అన్ని సర్కిళ్ల పోలీసులు నారాయణవనానికి చేరుకున్నారు.
జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు పుత్తూరులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మండల పార్టీ మన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ సుబ్బరాయశెట్టి, డీసీసీబీ డైరెక్టర్ సాయిరవి ఆదివారం సాయంత్రం పోలీసులతో చర్చించారు. అనంతరం సమస్య పరిష్కారానికి పీఎస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పుత్తూరు సీఐ సాయినాథ్ ప్రకటించారు. గొడవలకు కారకులైన వారి వివరాలను తెలపాలని సీఐ కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా రెండుగ్రామాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రెండు గ్రామాల మధ్య జరిగిన దాడిలో ఏడుమంది గాయపడిన సంఘటన తెలిసిందే.
అమాయకులపై కేసులు వద్దు
మండలంలోని సముదాయం, కీళగరం దళితవాడ వాసుల మధ్య నెలకొన్న ఘర్షణల్లో అమాయకులపై కేసులు పెట్టకుండా పోలీసులు న్యాయం చేయాలని సమన్వయకర్త ఆదిమూలం పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘర్షణలకు దూరంగా ఉన్న వారిపై కేసులు పెట్టొద్దన్నారు. రెండు గ్రామాల్లో పీఎస్ కమిటీæ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.