ఇద్దరు యువకుల సృష్టి ఈ-ఆటో
నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం.. కష్టమవుతున్న నియంత్రణ.. ఇద్దరు యువకులను ఆలోచింపజేసింది. కాలుష్య నగరికి కాసింత సాంత్వన చేకూర్చేందుకు ఈ స్నేహితులు ఈ-ఆటోను రూపొందించారు. చంపాపేటకు చెందిన మామిడోజు భరత్, నల్లగొండకు చెందిన మధుకర్‌రెడ్డి స్నేహితులు. బీటెక్ పూర్తి చేసిన వీరు పెద్దఅంబర్‌పేటలో అడాప్ట్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. తక్కువ ఖర్చుతో కాలుష్య రహిత వాహనాలను తయారు చేయాలని గత కొన్నేళ్లుగా అధ్యయనం చేసిన వీరు ఈ-ఆటోను రూపొందించారు.
‘ఇది ఐదు గంటలు చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీల సహాయంతో వీటిని రూపొందించాం. త్వరలోనే వీటికి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తాం. కేవలం రూ.లక్ష ఖర్చుతో వీటిని తయారుచేశాం. ‘స్వీకర్’ పేరుతో త్వరలోనే ప్యాసింజర్, ట్రాలీ ఈ-ఆటోలను మార్కెట్‌లోకి విడుదల చేస్తాం. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నామ’ని భరత్ తెలిపారు. వివరాలకు 9133073318, 18002700248(టోల్‌ఫ్రీ) నంబర్లలో సంప్రదించాలన్నారు.