గుడివాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో కృష్ణాజిల్లా గుడివాడలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి కుమారుడు ఉదయభాను (40) గురువారం అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించగా గదిలో సూసైడ్ నోట్ లభించింది. ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదయభాను ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
అవివాహితుడైన ఉదయభాను రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఉదయభాను ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.