రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అనే విషయం చర్చనీయాంశమైందని, హోదా వస్తుందా..రాదా అనే విషయంపై ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, ఈ అంశంపై ప్రజలకు బాబు స్పష్టమైన నిజాలు చెప్పాలన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, టీడీపీల మ్యాన్‌ఫెస్టోలో కూడా పొందుపర్చారని, బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై వత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో ప్రజలు వివరించాలన్నారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆర్నేల్లకే హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించటం చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. హోదా అంశంపై కేంద్రం చంద్రబాబుపై వత్తిడి చేసి, రాష్ట్రంలోని ప్రతిక్షపార్టీలను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని, హోదా ప్రాధాన్యతను ప్రతిపక్షపార్టీలు వివరిస్తాయని చెప్పుతున్నా పట్టించుకోవటంలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలోని 10 రాష్ట్రాలకు హోదా ఉండటం వలనే అభివృద్ధి చెందాయని, హోదా లేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందటం సాధ్యపడదన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో హోదా వస్తుందనే భావనతో రూ4.65లక్షల కోట్లతో పరిశ్రమలు స్థాపించేందుకు అంగీకారం తెలిపారని, హోదా రాకపోవటం వలన ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో నెలకొల్పలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రులు, గవర్నర్‌ను కలిసి హోదా అవశ్యకతను వివరించారని, హోదా కోసం సభలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీగా హోదా కోసం శక్తికి మించి పోరాడుతున్నామని, హోదా వచ్చేంత వరకు పోరాటంను ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ అరచకాలు ఎక్కువైయ్యాయని, వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.