పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగానికి తెర
పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగానికి తెర
Published Wed, Dec 21 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
- పత్తికొండ, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం
– జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్
నంద్యాలరూరల్: జిల్లాలో నూతన భారీ పరిశ్రమ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయ పునః ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరుకు చేసేందుకు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మరికొన్నింటిని అర్బన్ మండలాలుగా ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నంద్యాల, కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు అభినందనీయమని, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఒక్కో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం రూ.60లక్షలతో దొర్నిపాడు, చాగలమర్రి, ఆళ్లగడ్డకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.
ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం వద్ద 2వేల ఎకరాల్లో వెయ్యి మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఇదే ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయని, జూపాడు బంగ్లా మండలం, తంగడంచె వద్ద ప్రభుత్వం జైన్ ఇరిగేషన్ కంపెనీతో మెగా ఫుడ్‌పార్కు, అంబుజ కంపెనీ ద్వారా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పామని, ఈ పరిశ్రమల వల్ల మరో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వానికి భూమి అప్పగించిన జిల్లాలో మొదటి గుంటూరు కాగా రెండవది కర్నూలు జిల్లానేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement