
ఘటనా స్థలిలో రోధిస్తున్నక్షతగాత్రుల బంధువులు
∙ఫిలింనగర్‌క్లబ్ ఘటనలో ఇద్దరు మృతి
∙మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్ క్లబ్ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు.
కొందరు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నారు. కానీ క్షణాల్లో ప్రమాదం జరిగింది. అంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పోర్టికో పిల్లర్లు కూలిపోయాయి. దాంతో శ్లాబ్ నేలమట్టమైంది. శ్లాబ్‌పైనే పని చేస్తున్న 10 మంది కూలీల్లో రాయచూరుకు చెందిన మాన్‌శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడిక్కడే మృతి చెందారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీనివాస్(29), కర్ణాటకకు చెందిన శివ(31) తీవ్రం గా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు దవడ ఎముకలు విరిగాయి. శివకు తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ కర్ణాటకకు చెందిన మల్లేశం,సీతారాం, బీరప్ప,పశ్చిమబెంగాల్‌కు చెందిన అజిత్ బిశ్వాస్,సాహెబ్‌మండల్, ప్రకా శం జిల్లాకు చెందిన కోటేశ్వర్‌రావుకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివలను అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శివకు తల పగలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.