బకాయి.. ఆపై బడాయి | unelegible persons in hospital quarters | Sakshi
Sakshi News home page

బకాయి.. ఆపై బడాయి

Published Fri, Nov 4 2016 10:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

బకాయి.. ఆపై బడాయి

బకాయి.. ఆపై బడాయి

సర్వజనాస్పత్రి క్వార్టర్స్‌లో అనర్హుల 'మకాం'
ఏళ్లు గడుస్తున్నా అద్దె చెల్లించని వైనం
బయటి వ్యక్తులకూ అద్దెకిస్తున్న తీరు
పెండింగ్‌లో రూ.8.50 లక్షల బకాయి
నోటీసులు జారీ చేసినా ఫలితం శూన్యం


అనంతపురం మెడికల్‌ : అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో అనర్హులు పాగా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతరులు అందులో ఉంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అద్దె బకాయిలు కొండలా పేరుకుపోతున్నా..అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు.

నామమాత్రపు అద్దె
ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కోసం జీసెస్‌నగర్‌లో గృహ సముదాయాన్ని కట్టించారు. మొత్తం 35 క్వార్టర్స్‌ ఉన్నాయి. ఒక్కో క్వార్టర్‌లో కిచెన్, హాల్, బెడ్‌రూం సౌకర్యం ఉంది. నెలకు అద్దె రూ.1,433 మాత్రమే. నిబంధనల మేరకు ఇక్కడ ఉండాలంటే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అనుమతి తప్పనిసరి. క్వార్టర్స్‌ కావాలనుకున్న ఉద్యోగి తాను ఆస్పత్రిలోని ఫలానా విభాగంలో.. ఫలానా హోదాలో పని చేస్తున్నానని, తనకు క్వార్టర్‌ కేటాయించాలని దరఖాస్తు చేయాలి. అడ్వాన్స్‌గా రూ.5 వేలు, ఒక ఖాళీ చెక్కు, ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ నిబంధనలు అమలు కావడం లేదు. కొందరి నుంచి చెక్కులు, అడ్వాన్స్‌ తీసుకున్న అధికారులు.. మరికొందరి విషయంలో మాత్రం పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిడితో కొన్ని క్వార్టర్స్‌ కేటాయించేశారు. తీరా ఇక్కడ తిష్టవేసిన కొందరు ఉద్యోగులు నెలవారీగా అద్దెలు చెల్లించడం లేదు. కట్టండని అడిగే వారూ కరువయ్యారు. కొందరైతే క్వార్టర్‌ తీసుకుంటున్నప్పటి నుంచి అద్దె చెల్లించిన దాఖలాలు లేవు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి మొత్తం రూ.8.60 లక్షల బకాయి ఉంది. కొందరు తమ పేరు మీద తీసుకుని ఎక్కువ అద్దెకు ఇచ్చుకున్నారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
నిబంధనల ప్రకారం ఆస్పత్రి ఉన్నతాధికారులు తరచూ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఎవరికైతే కేటాయించారో వారే ఉంటున్నారా? ఇతరులు ఉంటున్నారా? అన్నది తెలుసుకోవాలి. ఉద్యోగులు కాని వారుంటే ఖాళీ చేయించాలి. అయితే అధికారులు మాత్రం ఇటువైపు చూడడమే మానేశారు. దీంతో కొందరి తీరు 'ఆడింది ఆట'గా మారిపోయింది. గతంలో కొందరు మద్యం సేవించి ఇక్కడ గొడవకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి.

ఉద్యోగులు కాకున్నా క్వార్టర్స్‌లో తిష్ట
ఆస్పత్రిలోని ఓ విభాగంలో పని చేసిన ఉద్యోగి కొన్నేళ్ల క్రితమే ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ ఏజెన్సీలో పని చేశాడు. నిబంధనల ప్రకారం ఆయనకు క్వార్టర్‌ కేటాయించకూడదు. కానీ ఉన్నతాధికారుల అండతో ఇప్పటికీ అతను అక్కడే నివాసం ఉంటున్నాడు. సుమారు రెండేళ్లుగా అద్దె బకాయి ఉన్నాడు. మరో ఉద్యోగి తన పేరు మీద క్వార్టర్‌ తీసుకుని తన బంధువులకు ఇచ్చాడు. వీరు ఏకంగా ఐదేళ్ల నుంచి అద్దె చెల్లించలేదు. ఇలాంటి వారు ఐదారు మంది వరకు ఉన్నారు. అద్దె బకాయిలపై గత నెలలో అధికారులు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని పేర్కొనగా గడువు కూడా ముగిసింది. అయినా ఫలితం లేదు.

క్వార్టర్స్‌ వారీగా బకాయి వివరాలు (ఏడాదికి పైగా బకాయి ఉన్నవి)
క్వార్టర్‌ నంబర్‌        అద్దె బకాయి మొత్తం
బీ–2, జీ4            రూ.85,980
బీ–2, ఎఫ్‌8             రూ.85,980
బీ–2, ఎఫ్‌4             రూ.61,619
బీ–2, ఎస్‌1            రూ.67,351
బీ–2, ఎస్‌6            రూ.54,454
బీ–1, ఎస్‌8            రూ.51,588
బీ–2, జీ7            రూ.48,722
బీ–2, ఎస్‌4            రూ.32,959
బీ–1, ఎఫ్‌8            రూ.34,392
బీ–1, ఎఫ్‌5            రూ.31,526
బీ–2, ఎస్‌3            రూ.28,660
బీ–2, ఎఫ్‌1            రూ.27,227
బీ–2, జీ5            రూ.25,794
బీ–2, ఎఫ్‌2            రూ.24,361
బీ–1, ఎఫ్‌2            రూ.24,361
బీ–2, ఎస్‌5            రూ.22,928

ఖాళీ చేయిస్తాం
కొన్నాళ్లుగా క్వార్టర్స్‌ అంశంపై కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగులు కాని వాళ్లుంటే ఖాళీ చేయిస్తాం. బకాయిల వసూళ్ల విషయమై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు ఇప్పటికే లేఖ రాశాం. గతంలో ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం ముందుకెళ్తా.
-డాక్టర్‌ జగన్నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement