నిరుద్యోగుల ఆగ్రహం
- కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
- నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
- ధర్నాకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరుద్యోగ భృతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించడంతో వందలాది మంది నిరుద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ బయటికి రావాలి, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కాని, నిరుద్యోగ భృతి కాని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నిరుద్యోగులను దగా చేయడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1200 ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం సివిల్, ఏఆర్ పోస్టులు కలిపి 707 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇందులో 375 పోస్టులు కోస్తాంధ్ర ఇచ్చి అత్యంత వెనుకబడిన రాయలసీమకు 57 పోస్టులు మంజూరు చేయడం దారుణమన్నారు. గ్రూపు–2 పోస్టులను పాత పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం నిరుద్యోగులు..జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్‌ను కలిశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ నిచ్చారు. ధర్నాలో నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు నాగేంద్ర, మౌలాలి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
దగా చేసిన ప్రభుత్వం: బిౖ.వె. రామయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ
ఎన్నికల్లో ఓట్ల కోసం నిరుద్యోగులకు ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పింది. చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. ఉద్యోగాలు కల్పించకపోగా, నిరుద్యోగ భృతి ఇవ్వలేమని నిసిగ్గుగా మంత్రి ప్రకటించడం దారుణం. నిరుద్యోగులకు అండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుంది.