నిరుద్యోగం, అవినీతి పెనుసవాళ్లు
ఏలూరు సిటీ : ప్రపంచంలోనే భారతదేశానిది ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మన దేశానికి నిరుద్యోగం, అవినీతి పెను సవాళ్లని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్యఎం.ముత్యాలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సీఆర్‌ఆర్ కళాశాల డిగ్రీ, పీజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాల ఆధ్వర్యంలో ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సులో ముఖ్యఅతిథిగా వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ విద్యాబోధనలో గురువు పాత్ర కీలకమైందని, నేటి సమాజంలో యువత సరైన మార్గంలో పయనించాలంటే గురువులే మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన సీఆర్‌ఆర్ విద్యాసంస్థల పాలక మండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సదస్సుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
ప్రధాన వక్త మధ్యప్రదేశ్ ఇండోర్ ఓరియంటల్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో ఉత్పాదక రంగానికి ప్రాధాన్యం పెరగాలని సూచించారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కృష్ణా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.వెంకయ్య, కెనడా దేశం ఒట్టావా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఏవీఎస్ రావు, నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటువంటి జాతీయస్థాయి సదస్సులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సదస్సులో సీఆర్‌ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ ఎన్‌వీకే దుర్గారావు, డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ యూఎస్ రామప్రసాద్, ప్రిన్సిపాల్ ఎన్.వీర్రాజు చౌదరి, కరస్పాండెంట్లు వి.రఘుకుమార్, కె.వి.లక్షీ్మనారాయణ, చలసాని విశ్వనా«థరావు, పీజీ డైరెక్టర్ సి.అరుణకుమారి, సదస్సు కన్వీనర్ ఆర్.రఘు, కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి ఏ.విజయకుమార్, అధ్యాపకులు వై.సౌజన్య, జి.వి.జగపతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు