గత విద్యాసంవత్సరం చివరలో యూనిఫాం పంపిణీ
కుట్టుకూలి బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం
ఎంఈవో కార్యాలయం చుట్టూ డ్వాక్రా మహిళల ప్రదక్షిణలు
ఫైలు సిద్ధం చేస్తున్నామంటున్న డీఈవో
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీచేసే యూనిఫాం విషయంలో విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన దుస్తులను మార్చి, ఏప్రిల్ నెలల్లో పంపిణీచేశారు. అయితే ఆ దుస్తులు కుట్టిన డ్వాక్రా మహిళలకు నేటికీ బిల్లులు చెల్లించలేదు.
మచిలీపట్నం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం విషయంలో అడుగడుగునా జాప్యం జరుగుతోంది. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచిన వెంటనే యూనిఫాం పంపిణీచేయాలి. అయితే విద్యాసంవత్సరం చివరిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో యూనిఫాం అందజేశారు. దుస్తులు కుట్టించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. ఎవరితో దుస్తులు కుట్టించాలనే అంశంపై తొలుత తర్జనభర్జన పడిన అధికారులు ఎట్టకేలకు ఆ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా 1.91,467 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం చొప్పున కుట్టించి అందజేశారు. దుస్తులు కుట్టినందుకు ఒక్కొక్క జతకు రూ.40 చొప్పున కుట్టుకూలిగా నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రూ.1.53 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుస్తులు కుట్టి అధికారులకు అప్పగించినా నేటి వరకూ కుట్టుకూలి రాలేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం నిత్యం డ్వాక్రా మహిళలు ఎంఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం కనిపించడంలేదు. సర్వశిక్షా అభియాన్‌లో నగదు నిల్వలు ఉన్నా ఏ కారణంతో బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
తొలి నుంచీ జాప్యమే
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందజేయడంలో తొలి నుంచీ నిర్లక్ష్యం కనబడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి యూనిఫాం అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలు మూసివేసే నాటికి అందజేశారు. విద్యార్థుల యూనిఫామ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను గత ఏడాది డిసెంబర్ నాటికి కూడా ఆప్కో ద్వారా సరఫరా చేయని పరిస్థితి నెలకొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెటీరియల్ అందజేస్తే మార్చి, ఏప్రిల్ నాటికి దుస్తులు కుట్టి విద్యార్థులకు పంపిణీచేశారు. కొన్ని చోట్ల డ్వాక్రా మహిళలు యూనిఫాం కుట్టారు. మరికొన్ని చోట్ల స్థానికంగా ఉన్న దర్జీలే డ్వాక్రా సంఘాల పేరుతో యూనిఫాం కుట్టారు. అధికార పార్టీకి చెందిన నాయకులు తమ వారికే ఈ కుట్టుపనిని అప్పగించాలని ఒత్తిళ్లు తెచ్చారు. పాఠశాల స్థాయి విద్యార్థులు ఎదిగే వయసులో ఉంటారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో యూనిఫాం కోసం కొలతల తీసుకుని ముగిసే నాటికి యూనిఫాంలను అందజేయడంతో కొంత మంది పిల్లలకు ఇచ్చిన దుస్తులు కొలతలు సరిపోని పరిస్థితి నెలకొంది.
ఫైలు సిద్ధం చేస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1.91,467 మంది విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ నెలలో యూనిఫాం అందజేశాం. డ్వాక్రా సంఘాల ద్వారానే యూనిఫాం దుస్తులు కుట్టించాం. డ్వాక్రా మహిళలకు నగదు ఇచ్చేందుకు ఫైలు సిద్ధం చేస్తున్నాం. - డీఈవో, ఎ. సుబ్బారెడ్డి