
రంగు దుస్తులే దిక్కు
♦ ప్రభుత్వ పాఠశాలలకు అందని యూనిఫాం
♦ ఎదురుచూస్తున్న 11,500 మంది విద్యార్థులు
హిందూపురం రూరల్ : పిల్లల్లో స్నేహభావం పెంపొందించి వారిలో పేద, ధనిక భేదాభిప్రాయాలు రాకుండా చూసేందుకు విద్యార్థులు యూనిఫాంలో పాఠశాలకు వెళ్తుంటారు. ప్రభుత్వం ప్రతి ఏటా విద్యాసంవత్సర ఆరంభంలోనే పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంకా రంగు దుస్తులతోనే బడికి వెళ్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా దుస్తులు కొనుగోలు, కుట్టే పని ప్రారంభం కాలేదు.
పాఠశాలల్లో దుస్తులు అందజేస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొత్త దుస్తులు (యూనిఫాం) కుట్టించకపోవడంతో పేద విద్యార్థులు చిరిగిన చొక్కాల్లోనే బడికి వెళ్తున్నారు. హిందూపురం మండలంలో 88 ప్రాథమిక పాఠశాలలు, 15 ప్రాథమికోన్నత ,18 జిల్లా ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు 11,500 మంది విద్యార్థులు ఏకరూప దుస్తుల (దుస్తులు) కోసం ఎదురుచూస్తున్నారు.
రెండు జతలు ఇవ్వాలి
ప్రతి ఏటా 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతలు చొప్పున ఏకరూప దుస్తులు అందిస్తారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందుగానే కొలతలు తీసుకుని పాఠశాలలు పునఃప్రారంభ సమయానికి పిల్లలకు దుస్తులు పంపిణీ చేసేవారు. కాగా గతేడాది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో యూనిఫాం పంపిణీ చేశారు. ఈ దఫా ఇప్పటికీ అతీగతీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ నెల లోపు విద్యార్థుల సంఖ్య తెలిపే ఇండెంట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరగా ఉపాధ్యాయులు హడావుడిగా పంపినట్లు సమాచారం. ఉపాధ్యాయులు పంపిన నివేదికల ఆధారంగా ఆయా పాఠశాలలకు దుస్తులు సరఫరా అవుతాయి.
ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు : గంగప్ప, ఎంఈఓ, హిందూపురం
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫాం అందజేయడానికి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాఠశాలకు కూడా ఇంకా అందజేయలేదు. ఆప్‌కో సంస్థ వారే క్లాత్‌ను ఎంపిక చేసి మహిళా సంఘాలకు పంపుతారు. అనంతరం పిల్లల కొలతలు తీసుకుని అందజేయడం ప్రతి ఏటా జరుగుతోంది.