ఆభరణాల లెక్క చూసుకుంటున్న ఉప ప్రధానార్చకులు
- బంగారు ఆభరణాల మాయంపై చర్యలు శూన్యమేనా ?
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు భద్రపరిచే బాధ్యతల నుంచి ప్రధానార్చకులను తప్పించారు. దీనిలో భాగంగా బుధవారం బంగారు ఆభరణాల లెక్కను ఆలయ ఉపప్రధానార్చకులకు అప్పగించారు. రామాలయంలో రెండు బంగారు నగలు మాయం కావటంతో దీనిపై పెద్దఎత్తున దుమారం రేగింది. గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన నగలు పదిరోజుల పాటు కనిపించకుండా పోయాయి. దీనిపై పెద్దఎత్తున ప్రచారం జరగటంతో వీటిని తీసిన అర్చకులే తిరిగి యథాస్థానంలో పెట్టారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం పరిణామంలో ఆలయంలోని ఇద్దరు ప్రధానార్చకుల బాధ్యాతారాహిత్యం ఉందని గుర్తించిన ఈఓ రమేష్‌బాబు వారిపై చర్యలకు సిద్దమయ్యారు. దీనిలో భాగంగా బంగారు ఆభర ణాలను భద్రపరిచే బాధ్యతలను నుంచి ప్రధానార్చకులైన జగన్నాథాచార్యులు, రామానుజాచార్యులను తప్పించారు. ఇక నుంచి ఆలయంలోని నలుగురు ఉప ప్ర«ధానార్చకుల ఆధీనంలోనే బంగారు ఆభరణాల లెక్క ఉండాలనే ఈఓ సూచనలు మేరకు వాటిని అప్పగించారు. ఇక నుంచి బంగారు ఆభరణాల భద్రతపై ప్రధానార్చకులకు ఎటువంటి బాధ్యత ఉండదు. భద్రాద్రి ఆలయంలో బంగారు నగలు మాయంపై దేశ వ్యాప్తంగా చర్చసాగినప్పటికీ, ఇందుకు బాధ్యులైన వారిపై తగిన రీతిలో చర్యలు లేకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ బంగారు ఆభరణాలు తీసిన అర్చకులెవరనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆభరణాలను మాయం చేసిన వారిని గుర్తించకపోవటంతో, ఆలయంలోని మిగతా అర్చకులపై ఆ ప్రభావం పడుతుందని, కంటితుడుపు చర్యలతోనే దేవస్థానం అధికారులు సరిపుచ్చటం వెనుక ఏదో మర్మం దాగి ఉందని, ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో ఈఓ రమేష్‌బాబు సైతం ఏమీ చేయలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది.