స్థాయిపెంపు ఆర్థిక భారమే..
-
ఏసీ నుంచి ఆర్‌జేసీ స్థాయికి తలుపులమ్మలోవ
-
దీనివల్ల భక్తులకు ఒరిగేదేమీ ఉండదంటున్న ఆలయ వర్గాలు
తుని రూరల్ :
అసిస్టెంట్ కమిషనర్ హోదాతో నడుస్తోన్న తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయికి పెంచడం వల్ల ఆర్థిక భారమే తప్ప భక్తులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదు దేవాలయాల స్థాయి పెంచాలన్న నిర్ణయం ఆయా ఆలయాలపై పరోక్షంగా ఆర్థికభారం మోపడమేనని పలువురు భక్తులతో పాటు, ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒక్కసారిగా..
1981లో దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చిన తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఏసీ స్థాయిలో ఉంది. ఐదారేళ్ల క్రితం డిప్యూటీ కమిషనర్ స్థాయికి పెంచాలని ప్రతిపాదనలు మూలనపడ్డాయి. ఇప్పుడు ఏకంగా రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయికి పెంచడంపై ఉద్యోగులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐదారేళ్లగా దుకాణాల లైసెన్సులు, హుండీలు, ప్రసాదం, పూజా సేవలు, విరాళాలు, అడ్వాన్సులు, డిపాజిట్ల ద్వారా ఆదాయం బాగా పెరిగింది. అంతే మొత్తం ఖర్చులూ అవుతున్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే.. దుకాణాల లైసెన్సులు, హుండీలు, వసతి, సేవలు, విరాళాలు, అడ్వాన్స్‌లు, వడ్డీలు, ఇతరత్రా ఆదాయం రూ.11.43 కోట్లు రాగా, ఎస్టాబ్లిష్‌మెంట్, గ్రూపు గ్రాట్యుటీ, సరకులు కొనుగోళ్లు, అభివృద్ధి, సౌకర్యాలు, తాగునీరు, మరమ్మతులు, స్టాట్యుటరీ, డిపాజిట్లు, ఇతర వ్యయాలకు పై మొత్తాన్ని ఖర్చుగా పేర్కొన్నారు. ఇందులో రూ.5,14,990లను అంత్య నిల్వగా చూపించారు.
పెంపుతో..
తలుపులమ్మ దేవస్థానంతోపాటు అరసవెల్లి, కోటప్పకొండ, అహోబిలం, మహానంది ఆలయాల స్థాయి పెంచినప్పుడు అవసరమైతే ఇప్పుడున్న సిబ్బందికి అదనపు సిబ్బందిని నియమించుకోవచ్చు. అదనంగా ఏఈఓ, డీఈ, పీఆర్‌ఓ సహా పది పోస్టులు లభిస్తాయి. దీంతో ఇప్పుడు నెలకు రూ.15లక్షలుగా ఉన్న జీతభత్యాలు రూ.20లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఏసీ స్థాయిలో అత్యవసరాలకు రూ.20వేలు ఖర్చు చేసే మొత్తం రూ.లక్షల వరకు వినియోగించుకోవచ్చు.
సర్ధుబాటుకే
ఆలయాలస్థాయి పెంపు ఉన్నతాధికారుల సర్దుబాటుకేనని తెలుస్తోంది. ప్రముఖ ఆలయాలకు ఐఏఎస్ అధికారులను నియమించాలన్న ప్రభుత్వం ఆలోచనలో భాగంగానే ఈ స్థాయి పెంపు అంశం తెరపైకి వచ్చిందంటున్నారు. అన్నవరం దేవస్థానం వంటి ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఆర్‌జేసీలు పర్యవేక్షిస్తున్నారు. వారి స్థానంలో ఐఏఎస్‌లను నియమించి ఆర్‌జేసీలకు కొత్తగా స్థాయి పెంచే ఆలయాల నిర్వహణను అప్పగిస్తారని తెలుస్తోంది. ఆదాయం, సౌకర్యాలు పెంపు వల్ల భక్తులకు మేలు జరుగుతుంది తప్ప, ఆలయాల స్థాయి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని పలువురు పేర్కొంటున్నారు.