ఖాకార్షా కొలువు మహిమలకు నెలవు
ఖాకార్షా కొలువు మహిమలకు నెలవు
Published Mon, Dec 5 2016 10:26 PM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM
కులమతాలకు అతీతంగా భక్తుల పూజలు
నేటి నుంచి ఉరుస్ ఉత్సవాలు
నగరంలో అతిపురాతనమైన దర్గా
కులమతాలకు అతీతంగా ప్రజల పూజలందుకుంటున్న సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గా ఉరుస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న ఖురాన్, 8న గంథోత్సవం, 9న మిలాద్ ఉన్నబి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అతిపురాతనమైన దర్గా గురించి...
– రాజమహేంద్రవరం కల్చరల్
మహా ప్రవక్త హజ్రత్ మహ్మద్ ఆదేశాల మేరకు, ఇస్లాం పరిరక్షణ కోసం సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా గోదావరీ తీరానికి బాగ్దాద్ నుంచి తరలి వచ్చారు. రాజరాజనరేంద్రుని కాలం కన్నా ముందే, క్రీ.శ. 850–950 మధ్యకాలంలో ఆయన ఈ ప్రాంతాతానికి వచ్చి, ఇక్కడ జీవించారు. బాబాలకు గురుబ్రహ్మ అయిన పిరానీ ఫీర్ దస్తగిర్ గౌస్ అజంకు ఈయన నాల్గవ తరానికి చెందిన వ్యక్తి.
రైల్వేస్టేషన్ సమీపంలో...
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేçÙనుకు సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పక్కనే ఉన్న హజ్రత్ ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గాను నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒక చింతచెట్టు ఉండేది. నిత్యం దైవారాధనలో కాలం గడిపే ఖాకార్షా తన జీవిత కాలంలో అనేక మహిమలు చూపారని నేటికీ భక్తులు చెబుతుంటారు.
ఎన్నో మహిమలు
ఖాకార్షా చిన్నగా దగ్గితే, ఆ శబ్దం సుమారు నాలుగయిదు కిలోమీటర్ల దూరం వినిపించేదట. దీంతో ఆ శబ్దం విన్న దుష్టశక్తులు పారిపోయేవట.
ఆయన తన శిషు్యడు ఫనా ఫిల్లాషాను జీవసమాధి చేసి, మూడు రోజుల తరువాత సజీవంగా బయటకు తీసుకువచ్చారని చెబుతారు.
ఖాకార్షా ధ్యానంలో ఉండగా ఒక పులి వచ్చి, ఆయన ఎదుటనే కూర్చునేదని, పాము పడగ విప్పి ఆయన సన్నిధిలో ఉండేదని భక్తులు చెబుతారు. క్రూరజంతువులు తమ స్వభావాలను విడిచి, సాధుజంతువులుగా మసలేవని చెబుతారు. నేటికీ ఓ పాములపుట్ట దర్గా ప్రాంగణంలో ఉంది.
చిన్నపిల్లలంటే ఖాకార్షాకు ప్రాణం. తన వద్ద ఉన్న కమండలం వంటి పాత్ర నుంచి బిర్యానీ తీసి పిల్లలకు తినిపించేవారట.
గోదావరి నది ఒడ్డున (నేటి గౌతమిఘాట్ ప్రాంతంలో) ఆయన కొబ్బరి చిప్పలోకి నదీ జలాలను తీసుకుని, తన కంబళి నుంచి దారపు పోగులను తీసి ఒత్తిగా చేసి అందులో ఉంచి దీపాలను వెలిగించేవారట.
అనారోగ్యానికి గురయిన భక్తులకు ఆయన కలలో కనబడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటారని చెబుతారు. సంతానం లేనివారు, శారీక, మానసిక బాధలతో ఉన్నవారు దర్గాను దర్శిస్తే స్వస్థత పొందుతామని భక్తుల విశ్వాసం. కులమతాలకు అతీతంగా నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
భగవంతుడిని ఆరాధించాలి
ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధనలో జీవితం గడపాలని, మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని ఖాకార్షా జ్ఞానబోధ చేసేవారుట. ఆయన దర్గా సమీపంలోనే ఆయన సోదరి బషీర్ ఫాతిమా అమ్మాజాన్ దర్గా ఉంది. ఈ ప్రాంగణంలోనే గౌస్ అజం (బాగ్దాద్), గరీబ్ నవాజ్ (అజ్మీర్), కొత్తలంక బాబా, తాజుద్దీన్ (నాగపూర్), కరీముల్లాషా ఖాదరీ తదితర ఔలియాల జెండాలు ఉన్నాయి.
Advertisement