హామీలను విస్మరించిన సర్కారు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంచ్యాతండా (మఠంపల్లి): ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ విస్మరించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మంచ్యాతండాలో నిర్వహించిన దుబ్బలగట్టు బంగారు మైసమ్మ జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలన్నింటిని గాలికి వదిలేసిందని ఈ సందర్భంగా ఉత్తమ్ ఆరోపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గిరిజనుల సమస్యలను లేవనెత్తుతానన్నారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రాప్రాంతాలకు వారధిగా కృష్ణానదిపై మట్టపల్లి వద్ద రూ.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనను త్వరితంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.