హైదరాబాద్: సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే ఉత్తమమైన పునరావాస ప్యాకేజీని పులిచింతల నిర్వాసితులకిచ్చామని ఆయన తెలిపారు. పులిచింతల నిర్వాసితుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. కానీ నిర్వాసితులు తనపై అసంతృప్తిగా ఉంటే రాజీనామా చేస్తానన్నారు. మల్లన్నసాగర్, పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులు.. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారమే పరిహారం, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. 2013 చట్టం కంటే 123 జీవో ప్రకారమే ఎక్కువ పరిహారం వస్తుందంటూ హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో భూముల ధర ఎకరాకు రిజిస్ర్టేషన్ రేటు రూ. 60 వేలు అయితే, మార్కెట్ రేటు రూ.6 లక్షలు ఉందన్నారు. భూముల మార్కెట్ ధరలు అప్డేట్ చేశాకే 2013 చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో వైపు జానారెడ్డి మాట్లాడుతూ భూమికి భూమి, ఇళ్లుకు ఇళ్లు ఇవ్వాలన్నారు. 123 జీవోతోనే ఎక్కువ లాభం అంటూ రైతులను మోసం చేయోద్దన్నారు. తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని , వాటిలో లోపాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామన్నారు.