ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
♦ టీఆర్‌ఎస్ సర్కార్‌పై ఉత్తమ్ ధ్వజం
♦ మున్సిపల్ చట్టసవరణ చెల్లదు
♦ దీనిపై ఎన్నికల సంఘానికి లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేసే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్లు, మున్సిపల్ చట్టసవరణపై ఎన్నికల సంఘానికి, రాష్ట్ర మున్సిపల్ కార్యదర్శికి లేఖ రాసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో హోర్డింగులు, ఫ్లెక్సీల విషయంలో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం, అధికారుల ఏకపక్ష వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాశామన్నారు. డివిజన్ల విభజన, రిజర్వేషన్లు విషయంలో టీఆర్‌ఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఎన్నికల సంఘానికి, కార్యదర్శికి లేఖ రాసినట్లు చెప్పారు. డివిజన్లకు రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీల అభ్యంతరాలను, ఫిర్యాదులను చెప్పడానికి కనీసం వారం రోజుల సమయం ఉండాలని కోరారు.
పార్టీల అధికారిక గుర్తులమీద ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు వంటివాటికి కూడా సమయం కావాల్సి ఉంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం మున్సిపల్ చట్టాన్ని కూడా మార్చడానికి వెనుకాడకుండా టీఆర్‌ఎస్ బరితెగిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మున్సిపల్ చట్ట సవరణ రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. మున్సిపల్ చట్టసవరణపై కోర్టుకు వెళ్లనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. టీఆర్‌ఎస్ మాటల పార్టీ, కాంగ్రెస్ చేతల పార్టీ అనే నినాదంతో రూపొందించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోస్టరును ఉత్తమ్‌కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, నిరంజన్ పాల్గొన్నారు.