దేవాదాయశాఖ విఫలం !
దేవాదాయశాఖ విఫలం !
Published Sat, Aug 13 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
సాక్షి, విజయవాడ :
పుష్కరాలంటే తొలుత పుణ్యస్నానం.. తరువాత పితృదేవతలకు పిండ ప్రదానం గుర్తుకు వస్తాయి. అటువంటి పిండ ప్రదానాలు చేయడానికి కనీస ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పురోహితులకు సకాలంలో గుర్తింపు కార్డులు జారీ చేయడంలోనూ దేవాదాయశాఖ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పురోహితులకు నరకం..
1992, 2004 పుష్కరాల సందర్భంగా దేవాదాయశాఖ రెండు నెలలు ముందుగా పురోహిత పెద్దలు, పురోహితlసంఘాల నేతలతోనూ సమావేశం ఏర్పాట్లు చేసి చర్చించింది. ఈసారి అందుకు భిన్నంగా పత్రికల్లో నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. మే నెలలో పురోహితులు పుష్కరాల్లో పిండ ప్రదానాలకు దరఖాస్తులు చేసుకున్నారు. పుష్కరాలకు పక్షం రోజు ముందు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఈ కార్డులలో ఏమాత్రం స్థానికత పాటించలేదు. గట్టు వెనక కామకోటి నగర్‌లోని బ్రాహ్మణులకు కృష్ణలంక ఘాట్లలోనూ, కృష్ణలంక, సత్యనారాయణపురం పురోహితులకు ఫెర్రి, భవానీ, పున్నమి ఘాట్లలోనూ విధులు వేశారు. అనేక వందల మంది స్థానిక బ్రాహ్మణులకు కార్డులు ఇవ్వలేదు. బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లడంతో ఘాట్లు ఆంక్షలు పెట్టవద్దని, అడిగిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వమని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నవారికి పదో తేదిన కార్డులు ఇస్తామని చెప్పారు. తరువాత 11వ తేదీ ఉదయం కౌతావారి సత్రంలో ఇస్తామని చెప్పారు. అక్కడ నుంచి రైల్వేస్టేడియానికి మార్చారు. చివరకు 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత కార్డులు జారీ చేశారు. అనేక మంది పురోహితులు తొలిఘాట్లకు వెళ్లలేకపోయారు.
ఘాట్లలో సౌకర్యాలు నిల్..
ఘాట్‌లో పిండ ప్రదానాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ కేవలం రెండు చిన్న షెడ్లు వేశారు. ఇక పిండాలు ఘాట్‌లో కాకుండా నదిలో వేసేందుకు ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు లేవు.
వృద్ధులు, వికలాంగుల మాటేమిటి.?
పిండ ప్రదానం చేసేవారిలో ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే ఉంటారు. ఇక 70 ఏళ్లు దాటిన వారు కూడా ఆసక్తి చూపుతారు. వీరంతా క్రింద కూర్చోలేకపోవచ్చు. క్రింద కూర్చుని చేయలేని అనేకమంది వృద్ధులు ఏర్పాట్లపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఘాట్లలో పిండ ప్రదాన కేంద్రాలు పెంచాలని, వృద్ధులకు బల్లలు, కుర్చీలు ఏర్పాటుపై దేవాదాయశాఖ దృష్టి సారించాలని పురోహిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భక్తుల అగచాట్లు!
కృష్ణా పుష్కరాలు తొలి రోజున స్నాన ఘాట్టాల్లో భక్తులు నామమాత్రంగా దర్శనం ఇచ్చారు. ఒకవైపు శ్రావణ శుక్రవారం.. పోలీసు ఆంక్షలతోడు పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు చేదు అనుభవమే మిగిలింది. పుష్కర స్నానం తరువాత మంచినీళ్లు తాగేందుకు వాటర్ బాటిల్స్ కాదు కదా.. ప్యాకెట్లు లభించలేదు. ఎండలో మంచినీళ్లు లేక వృద్ధులు, పిల్లలు నానా అగచాట్లు పడ్డారు.
స్థానికులకు
ప్రత్యక్ష నరకం..
వన్‌టౌన్‌లో నివాసితులు ప్రత్యక్ష నరకం చూశారు. కాళేశ్వరరావు మార్కెట్ దాటì ద్విచక్ర వాహనాలను లోపలకు అనుమతించలేదు. తమ ఇళ్లు బ్రాహ్మణవీధి, మార్వాడీ వీధి, శివాలయం వీధుల్లో ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణలంకలోనూ ఇదే పరిస్థితి.
తెలుగు తమ్ముళ్లు గుర్రు..
కారు బయటకు తీయాలంటేవీఐపీ పాస్ తప్పనిసరి. నగరంలో కేవలం ఐదు వందల వీఐపీ పాస్‌లు మంజూరు చేశారు. ఇవన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకే సరిపోయాయి.
Advertisement
Advertisement