నోరూరించే గవ్వలు.. వాహ్వా అనిపించే జంతికలు
-
చిటెకలో తయారు చేసే యంత్రం
-
ఇటలీ నుంచి రప్పించిన అనకాపల్లి శాస్త్రవేత్తలు
-
బెల్లం వినియోగం పెంచడమే ప్రధాన లక్ష్యం
అనకాపల్లి: బెల్లం వినియోగాన్ని మరింత పెంచేలా వివిధ రకాల వంటలు, ఆహార పదార్ధాలను తయారు చేసే యంత్రాలను అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞానం శాస్త్రవేత్తలు విదేశాల నుంచి రప్పించారు. దీనిలో భాగంగానే ఫుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే యంత్రం అనకాపల్లి చేరుకుంది. ఇటలీ దేశంలో రూపొందించిన ఈ యంత్రం ఖరీదు రూ.9.70 లక్షలు.
చిటెకలో గవ్వలు, జంతిక కాడల తయారీ
ఈ యంత్రం సహాయంతో చిటెకలో గవ్వలు, జంతిక కాడల ఆకారంలోని పిండి పదార్ధాలను తయారు చేయవచ్చు. పింyì , నూనె కలిపి ఈ యంత్రంలో వేస్తే గంటలో 25 కేజీల పిండిని కావాల్సిన గవ్వలు, జంతిక కాడల రూపంలోకి మార్చేస్తుంది. సాధారణంగా పిండి పదార్ధాలతో కూడిన గవ్వలు, జంతికల కాడలను తయారు చేసేందుకు ఒక కేజీకి ఒక రోజు పడుతుంది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ పరిధిలో జంతిక కాడలు, గవ్వల ఆకారంలో తయారు చేసేందుకు కొత్తగా రప్పించిన యంత్రం ఉపయోగపడుతుందని అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగ శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు చెబుతున్నారు.
బెల్లం తలసరి వినియోగం పెంచేందుకు...
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో బెల్లాన్ని పొడి రూపంలోనూ, ద్రవరూపంలో తయారు చేశాం. బెల్లం చాక్లెట్లు, బెల్లం కుకీస్, బెల్లం టాబ్లెట్లను కూడా రూపొందించాం. ఇటలీ నుంచి తీసుకొచ్చిన ఈ యంత్రం ద్వారా తయారు చేసే గవ్వలు, జంతిక కాడలను తీపిగానూ, కారంగానూ తయారు చేయవచ్చు. ముందుగా తీసుకున్న పిండిపదార్ధం, నూనెకు బెల్లాన్ని కలిపితే తీపిగానూ, తగిన పాళ్లలో కారం, ఉప్పు కలిపితే కారంగానూ రుచి వస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే బెల్లం తలసరి వినియోగాన్ని పెంచడమే ఈ ప్రయత్నం ఉద్దేశం. ఇటువంటి యంత్రాల సహాయంతో కావాల్సిన పిండి పదార్ధాలకు బెల్లాన్ని జోడిస్తే ఆ రుచే వేరు. తద్వారా బెల్లం వినియోగాన్ని పెంచుతూ చెరకు రైతులకు మేలు చేయడమే ఈ పరిజ్ఞాన లక్ష్యం.
–శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు