Readymade
-
Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు
సాక్షి, ఆదిలాబాద్: కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దాంపూర్ గ్రామానికి చెందిన నైతం లక్ష్మణ్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన వ్యవసాయ క్షేత్రంలో రెడీమేడ్ ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మణ్‌కు పదెకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆరెకరాల్లో ఆయిల్‌పాం, నాలుగెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. వారాంతపు సెలవుల్లో కుటుంబ సభ్యులతో వ్యవసాయక్షేత్రంలో సేదతీరేందుకు ఓ ఇల్లు కావాలనుకున్నాడు. ఇంటి లోపలి భాగం వెంటనే ఆర్డర్ పెట్టి రూ.4.80లక్షలతో రెడీమేడ్ ఇంటిని హైదరాబాద్ నుంచి తెప్పించాడు. ఇందుకు రవాణా ఖర్చు మరో రూ.45వేలు వెచ్చించాడు. ఈ రెడీమేడ్ ఇంటిలో బెడ్రూం, హాల్, కిచెన్, బాత్రూం ఇలా అన్ని వసతులున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నాడు. కాగా, రెడీమేడ్ ఇల్లును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చదవండి: Hyderabad: నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల నీరు నేలపాలు -
రెడీమేడ్ గూడు.. భలేగుంది చూడు
సాక్షి, ఆసిఫాబాద్ (కెరమెరి): ఉండేందుకు ఇల్లు లేక.. కట్టుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తలదాచుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆదిమ గిరిజనుల సొంతింటి కలను ఐటీడీఏ అధికారులు సాకారం చేశారు. రూ.3.4 లక్షలతో రెడీమేడ్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీ పరిధి శివగూడలో 13 కుటుంబాలున్నాయి. ఆదిమ గిరిజనులు (పీటీజీ) గూన, పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. దీంతో వారి కోసం ఒక్కొక్క ఇంటికి రూ.3.4 లక్షలు వెచ్చించి రెడీమేడ్‌గా 13 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఐటీడీఏ అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా మొదటి ఇంటిని టేకం మాణిక్‌రావు అనే లబ్ధిదారుకు నిర్మించారు. హాల్, బెడ్రూం, కిచెన్, మరుగుదొడ్లు, నేలకు రంగురంగుల టైల్స్ తదితర సౌకర్యాలతో ఇంటిని పూర్తి చేశారు. కిటికీలకు చలువ అద్దాలు అమర్చడంతో ఆకర్షణీయంగా ఇల్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణానికి 30 రోజుల సమయం పట్టిందని, 50 ఏళ్ల వరకు మన్నిక ఉంటుందని ఐటీడీఏ ఏఈ నజీమొద్దీన్ తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అందమైన ఇంట్లో నివసించాలనే కల నెరవేరనుండటంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆఫీస్ రెడీ’మేడ్
నగరంలో ఆఫీస్ ప్రారంభించాలంటే.? మాటలా..! కానీ అదిప్పుడు చాలా చిన్న విషయం అంటున్నాయి ‘కోవర్కింగ్ స్పేస్’ సంస్థలు. మీరేదైనా ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే అత్యాధునికమైన సౌకర్యాలతో, మీకు అవసరమైనంతలో ఆఫీస్ స్పేస్ అందిస్తామంటున్నాయి. విదేశాల్లో పాపులర్ అయిన ఈ ట్రెండ్.. ఇటీవల నగరంలోనూ ఊపందుకుంది. సాక్షి,సిటీబ్యూరో :సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుందర్‌కు జాబ్ మానేసి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన. మంచి కాన్సెప్ట్ కూడా రెడీ. ఇద్దరు స్నేహితులూజత కలిశారు. కానీ నగరంలోనిగచ్చిబౌలి లాంటి ప్రాంతంలో ఒక ఆఫీస్ ప్రారంభించాలంటే మాటలు కాదు... మూటలు కావాలి. అనుకున్న అద్దెలో ఖాళీ ప్లేస్ దొరకడం, దానికి రూ.కోట్ల ఖర్చుతో అవసరమైన హంగులు సమకూర్చడం తదితరాలుఒకెత్తయితే... ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలు, వ్యయప్రయాసలు మరో ఎత్తు. ఇంత చేసినా బిజినెస్ చేదు అనుభవం మిగిల్చితే... అవన్నీబూడిదలో పోసిన పన్నీరే అనే భయం. ఈ పరిస్థితుల్లోనే ఈ సమస్యలన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా సిటీలో అందుబాటులోకివచ్చింది కోవర్కింగ్స్పేస్ ట్రెండ్. స్పేస్ టు ఫెసిలిటీస్... కోవర్కింగ్ స్పేస్‌ను అందించే సంస్థలు అత్యంత అధునాతనంగా ఆఫీస్‌లను డిజైన్ చేస్తున్నాయి. కనీసం ఐదుగురి నుంచి 500మంది ఉద్యోగులకు అవసరమైన ఆఫీస్ స్పేస్‌ను అందిస్తున్నాయి. కంపెనీ ప్రారంభించాలనుకున్న వ్యక్తులు చేయాల్సిందల్లా... తాము ఎన్ని వర్క్ స్టేషన్లు అమర్చుకోవాలనుకుంటున్నాం? అనేది తెలియజేస్తే సరిపోతుంది. వర్క్ స్టేషన్‌కి ఇంత చొప్పున స్థలాన్ని కేటాయించి, దానికి అనుగుణంగానే చార్జ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆఫీస్‌కు సంబంధించి ఎలాంటి టెన్షన్లు మనకు ఉండవు. సెక్యూరిటీ మొదలు లోపల అవసరమైన క్యాబిన్స్, సర్వర్ రూమ్స్, సర్వర్ ర్యాక్స్, ఇంటర్నెట్ వైఫై, కెఫెటేరియా, లాబీస్పేస్, కాన్ఫరెన్స్ రూమ్స్... ఇలా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫీస్‌లో చిరు సేవలు అందించడానికి అవసరమైన మ్యాన్ పవర్ సైతం సిద్ధంగా ఉంటుంది. సంస్థ ఉద్యోగుల సంఖ్య పెరిగే పరిస్థితుల్లో ఆ విషయం తెలియజేస్తే చాలు... కేవలం 15 రోజుల వ్యవధిలో పెరిగిన ఉద్యోగులకు సరిపడా స్పేస్‌ని సిద్ధం చేస్తారు. ఇక ఆఫీస్ సరిగా నడవని పరిస్థితుల్లో ఖాళీ చేయాలనుకుంటే మూడు నెలల ముందుగా నోటీసు ఇచ్చి, దాని ప్రకారం టాటా చెప్పేసి వెళ్లొచ్చు. ఎన్నో ఉపయోగాలు... నగరంలో ఒక కొత్త కార్యాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అవుతోందని నగరానికి చెందిన ఆర్కిటెక్ట్ విజయ్ చెప్పారు. అంటే... మొత్తం 100మంది ఉద్యోగులుండే కంపెనీ అనుకుంటే మౌలిక వసతుల కల్పనకే కనీసం రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుం దని ఆయన పేర్కొన్నారు. అది కా కుండా అడ్వాన్స్‌లు, అద్దెలు, నిర్వహణ, మ్యాన్‌పవర్‌ని సమకూర్చుకోవడం, దాని తాలూకు బాదరాబందీలు, వ్యయప్రయాసలు అదనం. ఇంత పెట్టుబడికి తగిన లాభాలు తిరిగి రావాలంటే కనీసం ఐదేళ్లు కొనసాగితేనే వర్కవుట్ అవుతుందనీ... కాబట్టే ఈ కోవర్కిం గ్ స్పేస్ చాలా సక్సెస్ అయిందని విశ్లేషించారాయ న. చాలా కంపెనీలకు వచ్చే ప్రాజెక్ట్‌లు ఏడాది, ఏడాదిన్నర వ్యవధికి మాత్రమే పరిమితమవుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు రాకపోతే కంపెనీని నిర్వహించడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ తరహా స్పేస్ షేరింగ్ అయితే వెంటనే ఆఫీస్‌ని క్లోజ్ చేయడం సాధ్యపడుతుంది. అదే సొంతంగా ఏర్పాటు చేసుకున్నదైతే... దానికి సంబంధించి మన పెట్టుబడి అవన్నీ చూసుకొని గానీ చేయలేం. పైగా ఇలాంటి కోవర్కింగ్ స్పేస్ కనీసం 10వేల చదరపు అడుగుల నుంచి దాదాపు లక్షకు పైగా చదరపు అడుగుల్లో ఏర్పాటవుతున్నాయి. తద్వారా అతి పెద్ద ఆఫీస్ స్పేస్‌లో పనిచేస్తున్నామనే అనుభూతి కూడా లభిస్తుంది. పైగా వీటిలో అత్యధికం గ్రేడియర్ బిల్డింగ్సే (అన్ని రకాల జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించి నిర్మించే భవనాలు) కావడం వల్ల భద్రత, సౌకర్యాల పరంగాలోటుండదు. సుందర్, ఆయన స్నేహితులు వారితో అరడజను మంది సిబ్బంది, ఓ పది ల్యాప్‌టాప్‌లు పట్టుకొని నేరుగా తమకంటూ ఏర్పాటైన ఆఫీస్ స్పేస్‌లోకి వెళ్లిపోయారు. సొంత ఆఫీస్‌లోనే సెక్యూరిటీ మధ్య.. కాఫీలు, టీలూ తాగుతూ పనులు పూర్తి చేసుకున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక ఆ ఆఫీస్‌కి సంబంధించి విద్యుత్ బిల్లులు, మెయింటనెన్స్ చార్జీలు... తదితర ఎలాంటి టెన్షన్లు లేవు. ఇదేమీ తావిదు మహిమ కాదు.. కోవర్కింగ్ స్పేస్ కాన్సెప్ట్ ప్రభావం. వేళ్లూనుకుంటున్న ట్రెండ్... ఒకటే చూరు కింద వివిధ కంపెనీలు పనిచేయడమనే ‘కోవర్కింగ్ స్పేస్’ కాన్సెప్ట్ పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని దేశాల్లో దాదాపు సగం కంపెనీలు ఇదే తరహాలో ఆఫీస్‌లు నిర్వహిస్తాయి. అయితే మన దగ్గర మాత్రం ఓ కంపెనీ, మరో కంపెనీతో కలిసి పనిచేయాలంటే ఏవో భయాలు, ఇన్సెక్యూరిటీ ఉండడంతోఈ కాన్సెప్ట్ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు నగరంలో చోటు దొరకడం అత్యంత ఖరీదైన నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఊపందుకుంది. నగరంలో ఓ ఐదేళ్ల క్రితం ఒకటీ అరా కోవర్కింగ్ స్పేస్ అందించే సంస్థలు ఉండగా, ఇప్పుడవి దాదాపు 40కి చేరుకోవడం గమనార్హం. మా ‘స్పేస్’లో 80 కంపెనీలు.. ‘ఒక ఆఫీస్ ప్రారంభించాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలనేది సీఏ కన్సల్టెంట్‌గా, ఒక మహిళగా నాకు అనుభవపూర్వకమే. ఇటీవల పెరిగిన స్టార్టప్స్ అదే రకమైన సమస్యతో బాగా అవస్థలు పడుతున్నట్టు అర్థమైంది. అలాంటి కొన్ని కంపెనీలకు బంజారాహిల్స్‌లోని మా ఆఫీస్‌లోనే కాసింత చోటు కల్పించిన రోజులున్నాయి. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది’ అంటూ చెప్పారు సుందరి పాటిబండ్ల. నగరంలో కోవర్కింగ్ ఆఫీస్ స్పేస్ ఆఫర్ చేస్తున్న వాటిలో అత్యధికంగా ఎంఎన్‌సీలే ఉంటే... ఈ రంగంలో అడుగుపెట్టిన స్థానిక తెలుగు మహిళ ఈమే కావడం గమనార్హం. ‘ఈ రోజు బిజినెస్ ఐడియా వస్తే... రేపు కంపెనీ అనౌన్స్ చేసేయొచ్చు. అంత ఈజీగా ఈ రెడీమేడ్ ఆఫీస్‌లు ఉపకరిస్తాయి. తొలుత కొండాపూర్‌లో 12,500 చదరపు అడుగుల్లో 200 సీటింగ్ కెపాసిటీతో కోవర్కింగ్ స్పేస్ స్టార్ట్ చేస్తే... అది కేవలం రెండు నెలల్లో ఫిలప్ అయిపోయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బంజారాహిల్స్‌లో 95వేల చదరపు అడుగుల్లో 1800 సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేశాం. స్టార్టప్స్‌కి అకౌంటింగ్, జీఎస్టీ రిటరŠన్స్ తదితర అన్ని సహాయాలు చేస్తున్నాం. ప్రస్తుతం మేం అందిస్తున్న స్పేస్‌లో దాదాపు 80 కంపెనీలకు పైనే ఆఫీస్‌లు నిర్వహిస్తున్నాయి’ అని వివరించారు సుందరి. -
సిటీజన్స్.. బీ అలర్ట్..
సాక్షి, సిటీబ్యూరో: రెడీమేడ్ ఫుడ్ అంటే మక్కువ చూపుతున్నారా.. పిజ్జా, బర్గర్, షుగర్ డ్రింక్స్.. చికెన్ నగ్గెట్స్.. చాకొబార్స్ వంటివి ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే కొద్ది పరిమాణంలో ఓకేగాని.. 50 శాతం మించితే క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఇటీవల దేశంలో కాస్మో పాలిటన్ కల్చర్‌కు కేంద్ర బిందువుగా మారిన పలు మెట్రో నగరాల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్(వివిధ రీతుల్లో శుద్ధి చేసి నిల్వ ఉండేందుకు సంరక్షకాలను కలిపిన పదార్థాలు) వినియోగం 10 శాతం మేర పెరిగినట్లు ‘కాల్ హెల్త్’ సంస్థ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహార పదార్థాల వినియోగం అనూహ్యంగా పెరగ్గా.. దానితో పాటు 12 శాతం క్యాన్సర్ రిస్క్ పెరుగినట్టు ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత్తా నగరాల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయన నివేదిక వెల్లడించడం గమనార్హం. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితాలోఉన్న కొన్ని పదార్థాలు.. ♦ తినడానికి సిద్ధంగా.. ఫ్రిజ్‌లో నిల్వచేసిన ఆహారం (ఫ్రోజెన్ రెడీ టు ఈట్ మీల్స్) ♦ చికెన్ నగ్గెట్స్, పిజ్జా, అధిక మొత్తంలో నిల్వచేసి ప్రాసెస్ చేసిన బ్రెడ్, కేకులు ♦ చక్కెరతో తయారు చేసిన డ్రింక్స్, రెండు నిమిషాల్లో రెడీ చేసుకునే నూడుల్స్, సూప్స్ ♦ చక్కెర కలిపిన తృణ పప్పు ధాన్యాలు (షుగర్ బ్రేక్‌ఫాస్ట్ సిరిల్స్) ♦ చక్కెర మోతాదు అధికంగా ఉండే స్నాక్స్, చిప్స్ ♦ చాకొబార్స్, స్వీట్స్ తగ్గించకుంటే క్యాన్సర్ ముప్పు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో ముడి పదార్థాలను వివిధ రీతుల్లో అత్యధికంగా వేడిచేసి శుద్ధి చేస్తారు. ఇవి ఎక్కు కాలం నిల్వ ఉండేలా చక్కెర, ఇతర సంరక్షాలు, ఫ్లేవర్స్, రంగులను అధిక మోతాదులో కలుపుతారు. అంతేగాక వీటిలో ఎక్కువగా వినియోగించే సోడియం నైట్రేట్, టిటానియం ఆక్సైడ్తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బర్గర్స్, చికెన్ నగ్గెట్స్, చాకొబార్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ వెరైటీలే అధికమని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజా సర్వేలోనూ తేలింది. సో సిటీజన్స్ బీ అలర్ట్. తాజా పదార్థాలైతే బెటర్.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇళ్లలో తయారు చేసుకునే బ్రెడ్, బిస్కట్లు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రిఫ్రజిరేటర్లలో అధిక కాలం నిల్వ చేసిన పదార్థాల కంటే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయాలను తీసుకుంటే క్యాన్సర్ మప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటునన్నారు. -
నోరూరించే గవ్వలు.. వాహ్వా అనిపించే జంతికలు
చిటెకలో తయారు చేసే యంత్రం ఇటలీ నుంచి రప్పించిన అనకాపల్లి శాస్త్రవేత్తలు బెల్లం వినియోగం పెంచడమే ప్రధాన లక్ష్యం అనకాపల్లి: బెల్లం వినియోగాన్ని మరింత పెంచేలా వివిధ రకాల వంటలు, ఆహార పదార్ధాలను తయారు చేసే యంత్రాలను అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞానం శాస్త్రవేత్తలు విదేశాల నుంచి రప్పించారు. దీనిలో భాగంగానే ఫుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే యంత్రం అనకాపల్లి చేరుకుంది. ఇటలీ దేశంలో రూపొందించిన ఈ యంత్రం ఖరీదు రూ.9.70 లక్షలు. చిటెకలో గవ్వలు, జంతిక కాడల తయారీ ఈ యంత్రం సహాయంతో చిటెకలో గవ్వలు, జంతిక కాడల ఆకారంలోని పిండి పదార్ధాలను తయారు చేయవచ్చు. పింyì , నూనె కలిపి ఈ యంత్రంలో వేస్తే గంటలో 25 కేజీల పిండిని కావాల్సిన గవ్వలు, జంతిక కాడల రూపంలోకి మార్చేస్తుంది. సాధారణంగా పిండి పదార్ధాలతో కూడిన గవ్వలు, జంతికల కాడలను తయారు చేసేందుకు ఒక కేజీకి ఒక రోజు పడుతుంది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ పరిధిలో జంతిక కాడలు, గవ్వల ఆకారంలో తయారు చేసేందుకు కొత్తగా రప్పించిన యంత్రం ఉపయోగపడుతుందని అనకాపల్లి పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగ శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు చెబుతున్నారు. బెల్లం తలసరి వినియోగం పెంచేందుకు... అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పంటకోత అనంతర పరిజ్ఞాన విభాగం ఆధ్వర్యంలో బెల్లాన్ని పొడి రూపంలోనూ, ద్రవరూపంలో తయారు చేశాం. బెల్లం చాక్లెట్లు, బెల్లం కుకీస్, బెల్లం టాబ్లెట్లను కూడా రూపొందించాం. ఇటలీ నుంచి తీసుకొచ్చిన ఈ యంత్రం ద్వారా తయారు చేసే గవ్వలు, జంతిక కాడలను తీపిగానూ, కారంగానూ తయారు చేయవచ్చు. ముందుగా తీసుకున్న పిండిపదార్ధం, నూనెకు బెల్లాన్ని కలిపితే తీపిగానూ, తగిన పాళ్లలో కారం, ఉప్పు కలిపితే కారంగానూ రుచి వస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే బెల్లం తలసరి వినియోగాన్ని పెంచడమే ఈ ప్రయత్నం ఉద్దేశం. ఇటువంటి యంత్రాల సహాయంతో కావాల్సిన పిండి పదార్ధాలకు బెల్లాన్ని జోడిస్తే ఆ రుచే వేరు. తద్వారా బెల్లం వినియోగాన్ని పెంచుతూ చెరకు రైతులకు మేలు చేయడమే ఈ పరిజ్ఞాన లక్ష్యం. –శాస్త్రవేత్త పి.వి.కె.జగన్నాథరావు