‘ఆఫీస్‌ రెడీ’మేడ్‌ | Coworking Space In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఆఫీస్‌ రెడీ’మేడ్‌

Published Fri, Aug 24 2018 7:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Coworking Space In Hyderabad - Sakshi

నగరంలో ఆఫీస్‌ ప్రారంభించాలంటే.? మాటలా..! కానీ అదిప్పుడు చాలా చిన్న విషయం అంటున్నాయి ‘కోవర్కింగ్‌ స్పేస్‌’ సంస్థలు. మీరేదైనా ఆలోచనతో బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని అనుకుంటే అత్యాధునికమైన సౌకర్యాలతో, మీకు అవసరమైనంతలో ఆఫీస్‌ స్పేస్‌ అందిస్తామంటున్నాయి. విదేశాల్లో పాపులర్‌ అయిన ఈ ట్రెండ్‌.. ఇటీవల నగరంలోనూ ఊపందుకుంది. 

సాక్షి,సిటీబ్యూరో :సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సుందర్‌కు జాబ్‌ మానేసి సొంతంగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలనే ఆలోచన. మంచి కాన్సెప్ట్‌ కూడా రెడీ. ఇద్దరు స్నేహితులూజత కలిశారు. కానీ నగరంలోనిగచ్చిబౌలి లాంటి ప్రాంతంలో ఒక ఆఫీస్‌ ప్రారంభించాలంటే మాటలు కాదు... మూటలు కావాలి. అనుకున్న అద్దెలో ఖాళీ ప్లేస్‌ దొరకడం, దానికి రూ.కోట్ల ఖర్చుతో అవసరమైన హంగులు సమకూర్చడం తదితరాలుఒకెత్తయితే... ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలు, వ్యయప్రయాసలు మరో ఎత్తు. ఇంత చేసినా బిజినెస్‌ చేదు అనుభవం మిగిల్చితే... అవన్నీబూడిదలో పోసిన పన్నీరే అనే భయం. ఈ పరిస్థితుల్లోనే ఈ సమస్యలన్నింటికీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా సిటీలో అందుబాటులోకివచ్చింది కోవర్కింగ్‌స్పేస్‌ ట్రెండ్‌. 

స్పేస్‌ టు ఫెసిలిటీస్‌...  
కోవర్కింగ్‌ స్పేస్‌ను అందించే సంస్థలు అత్యంత అధునాతనంగా ఆఫీస్‌లను డిజైన్‌ చేస్తున్నాయి. కనీసం ఐదుగురి నుంచి 500మంది ఉద్యోగులకు అవసరమైన ఆఫీస్‌ స్పేస్‌ను అందిస్తున్నాయి. కంపెనీ ప్రారంభించాలనుకున్న వ్యక్తులు చేయాల్సిందల్లా... తాము ఎన్ని వర్క్‌ స్టేషన్లు అమర్చుకోవాలనుకుంటున్నాం? అనేది తెలియజేస్తే సరిపోతుంది. వర్క్‌ స్టేషన్‌కి ఇంత చొప్పున స్థలాన్ని కేటాయించి, దానికి అనుగుణంగానే చార్జ్‌ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆఫీస్‌కు సంబంధించి ఎలాంటి టెన్షన్లు మనకు ఉండవు. సెక్యూరిటీ మొదలు లోపల అవసరమైన క్యాబిన్స్, సర్వర్‌ రూమ్స్, సర్వర్‌ ర్యాక్స్, ఇంటర్నెట్‌ వైఫై, కెఫెటేరియా, లాబీస్పేస్, కాన్ఫరెన్స్‌ రూమ్స్‌... ఇలా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫీస్‌లో చిరు సేవలు అందించడానికి అవసరమైన మ్యాన్‌ పవర్‌ సైతం సిద్ధంగా ఉంటుంది. సంస్థ ఉద్యోగుల సంఖ్య పెరిగే పరిస్థితుల్లో ఆ విషయం తెలియజేస్తే చాలు... కేవలం 15 రోజుల వ్యవధిలో పెరిగిన ఉద్యోగులకు సరిపడా స్పేస్‌ని సిద్ధం చేస్తారు. ఇక ఆఫీస్‌ సరిగా నడవని పరిస్థితుల్లో ఖాళీ చేయాలనుకుంటే మూడు నెలల ముందుగా నోటీసు ఇచ్చి, దాని ప్రకారం టాటా చెప్పేసి వెళ్లొచ్చు.  
 
ఎన్నో ఉపయోగాలు...
నగరంలో ఒక కొత్త కార్యాలయాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయం చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు అవుతోందని నగరానికి చెందిన ఆర్కిటెక్ట్‌ విజయ్‌ చెప్పారు. అంటే... మొత్తం 100మంది ఉద్యోగులుండే కంపెనీ అనుకుంటే మౌలిక వసతుల కల్పనకే కనీసం రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుం దని ఆయన పేర్కొన్నారు. అది కా కుండా అడ్వాన్స్‌లు, అద్దెలు, నిర్వహణ, మ్యాన్‌పవర్‌ని సమకూర్చుకోవడం, దాని తాలూకు బాదరాబందీలు, వ్యయప్రయాసలు అదనం. ఇంత పెట్టుబడికి తగిన లాభాలు తిరిగి రావాలంటే కనీసం ఐదేళ్లు కొనసాగితేనే వర్కవుట్‌ అవుతుందనీ... కాబట్టే ఈ కోవర్కిం గ్‌ స్పేస్‌ చాలా సక్సెస్‌ అయిందని విశ్లేషించారాయ న. చాలా కంపెనీలకు వచ్చే ప్రాజెక్ట్‌లు ఏడాది, ఏడాదిన్నర వ్యవధికి మాత్రమే పరిమితమవుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు రాకపోతే కంపెనీని నిర్వహించడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ తరహా స్పేస్‌ షేరింగ్‌ అయితే వెంటనే ఆఫీస్‌ని క్లోజ్‌ చేయడం సాధ్యపడుతుంది. అదే సొంతంగా ఏర్పాటు చేసుకున్నదైతే... దానికి సంబంధించి మన పెట్టుబడి అవన్నీ చూసుకొని గానీ చేయలేం. పైగా ఇలాంటి కోవర్కింగ్‌ స్పేస్‌ కనీసం 10వేల చదరపు అడుగుల నుంచి దాదాపు లక్షకు పైగా చదరపు అడుగుల్లో ఏర్పాటవుతున్నాయి. తద్వారా అతి పెద్ద ఆఫీస్‌ స్పేస్‌లో పనిచేస్తున్నామనే అనుభూతి కూడా లభిస్తుంది. పైగా వీటిలో అత్యధికం గ్రేడియర్‌ బిల్డింగ్సే (అన్ని రకాల జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించి నిర్మించే భవనాలు) కావడం వల్ల భద్రత, సౌకర్యాల పరంగాలోటుండదు.  

సుందర్, ఆయన స్నేహితులు వారితో అరడజను మంది సిబ్బంది, ఓ పది ల్యాప్‌టాప్‌లు పట్టుకొని నేరుగా తమకంటూ ఏర్పాటైన ఆఫీస్‌ స్పేస్‌లోకి వెళ్లిపోయారు. సొంత ఆఫీస్‌లోనే సెక్యూరిటీ మధ్య.. కాఫీలు, టీలూ తాగుతూ పనులు పూర్తి చేసుకున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక ఆ ఆఫీస్‌కి సంబంధించి విద్యుత్‌ బిల్లులు, మెయింటనెన్స్‌ చార్జీలు... తదితర ఎలాంటి టెన్షన్లు లేవు. ఇదేమీ తావిదు మహిమ కాదు.. కోవర్కింగ్‌ స్పేస్‌ కాన్సెప్ట్‌ ప్రభావం.  

వేళ్లూనుకుంటున్న ట్రెండ్‌...
ఒకటే చూరు కింద వివిధ కంపెనీలు పనిచేయడమనే ‘కోవర్కింగ్‌ స్పేస్‌’ కాన్సెప్ట్‌ పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. కొన్ని దేశాల్లో దాదాపు సగం కంపెనీలు ఇదే తరహాలో ఆఫీస్‌లు నిర్వహిస్తాయి. అయితే మన దగ్గర మాత్రం ఓ కంపెనీ, మరో కంపెనీతో కలిసి పనిచేయాలంటే ఏవో భయాలు, ఇన్‌సెక్యూరిటీ ఉండడంతోఈ కాన్సెప్ట్‌ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు నగరంలో చోటు దొరకడం అత్యంత ఖరీదైన నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఈ కాన్సెప్ట్‌ ఇప్పుడు బాగా ఊపందుకుంది. నగరంలో ఓ ఐదేళ్ల క్రితం ఒకటీ అరా కోవర్కింగ్‌ స్పేస్‌ అందించే సంస్థలు ఉండగా, ఇప్పుడవి దాదాపు 40కి చేరుకోవడం గమనార్హం.  

మా ‘స్పేస్‌’లో 80 కంపెనీలు.. 
‘ఒక ఆఫీస్‌ ప్రారంభించాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలనేది సీఏ కన్సల్టెంట్‌గా, ఒక మహిళగా నాకు అనుభవపూర్వకమే. ఇటీవల పెరిగిన స్టార్టప్స్‌ అదే రకమైన సమస్యతో బాగా అవస్థలు పడుతున్నట్టు అర్థమైంది. అలాంటి కొన్ని కంపెనీలకు బంజారాహిల్స్‌లోని మా ఆఫీస్‌లోనే కాసింత చోటు కల్పించిన రోజులున్నాయి. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది’ అంటూ చెప్పారు సుందరి పాటిబండ్ల. నగరంలో కోవర్కింగ్‌ ఆఫీస్‌ స్పేస్‌ ఆఫర్‌ చేస్తున్న వాటిలో అత్యధికంగా ఎంఎన్‌సీలే ఉంటే... ఈ రంగంలో అడుగుపెట్టిన స్థానిక తెలుగు మహిళ ఈమే కావడం గమనార్హం. ‘ఈ రోజు బిజినెస్‌ ఐడియా వస్తే... రేపు కంపెనీ అనౌన్స్‌ చేసేయొచ్చు. అంత ఈజీగా ఈ రెడీమేడ్‌ ఆఫీస్‌లు ఉపకరిస్తాయి. తొలుత కొండాపూర్‌లో 12,500 చదరపు అడుగుల్లో 200 సీటింగ్‌ కెపాసిటీతో కోవర్కింగ్‌ స్పేస్‌ స్టార్ట్‌ చేస్తే... అది కేవలం రెండు నెలల్లో ఫిలప్‌ అయిపోయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బంజారాహిల్స్‌లో 95వేల చదరపు అడుగుల్లో 1800 సీటింగ్‌ కెపాసిటీతో ఏర్పాటు చేశాం. స్టార్టప్స్‌కి అకౌంటింగ్, జీఎస్టీ రిటరŠన్స్‌ తదితర అన్ని సహాయాలు చేస్తున్నాం. ప్రస్తుతం మేం అందిస్తున్న స్పేస్‌లో దాదాపు 80 కంపెనీలకు పైనే ఆఫీస్‌లు నిర్వహిస్తున్నాయి’ అని వివరించారు సుందరి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement