
మృతి చెందిన పామలిన్ కుక్క
బికనీర్‌వాలా బేకరీకి చెందిన వాహనం ఢీకొనడంతో పెంపుడు కుక్క మరణించింది.
సాక్షి,పంజగుట్ట: డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మూగజీవిని బలిగొంది. బేకరీకి వస్తువులను తరలిస్తున్న వాహనం పెంపుడు కుక్కపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రేమ్‌నగర్ బస్తీలో బికనీర్‌వాలా బేకరీకి చెందిన కిచెన్ ఉంది. ఇక్కడ తయారైన బ్రెడ్ తదితరాలను సదరు బేకరీకి తరలిస్తుంటారు. మంగళవారం రాత్రి ప్రేమ్‌నగర్ బస్తీ మీదుగా బీకనీర్‌వాలా కిచెన్ వద్దకు వస్తున్న వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి అక్కడే ఉన్న పామలిన్ జాతికి చెందిన ఓ పెంపుడు కుక్కపైకి ఎక్కించడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిను కుక్క యజమానులు, స్థానికులు బికనీర్‌వాలా వాహనాలతో పాటు కిచెన్‌పైన దాడి చేశారు. అనంతరం కక్క మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని యజమానులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
జనావాసాల మధ్య బేకరీ బట్టీలా?
ఇళ్ల మధ్య ఉన్న ఈ బేకరీ బట్టీలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రేమ్‌నగర్ బస్తీవాసులు తెలిపారు. అసలు ఇక్కడ బేకరీ కిచెన్ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా? ఉంటే... అగ్నిమాపకశాఖ, పొల్యూషన్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తాయి అని ప్రశ్నించారు. నిత్యం ఉదయం సాయంత్రం వేళ్లలో తమ బస్తీ మీదుగా బేకరీ కిచెన్ వద్దకు పదుల సంఖ్యలో ట్రాన్స్‌పోర్టు వాహనాలు వెళ్తుండటంతో తాము ఇబ్బందులు ఎదుర్కొటున్నామని బికనీర్‌వాలా బేకరీ యజమానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కుక్క చనిపోయిందని, అదే బస్తీలో ఆడుకొనే చిన్నారులకు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బస్తీ మధ్యలో ఉన్న ఈ కిచెన్‌ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.