
దొంగ..దొంగ అని అరిచినందుకే.. చంపాను
చందానగర్ : పక్కింట్లో మధ్యాహ్నం వేళల్లో వృద్ధురాలు ఒక్కతే ఉంటుందని, తాను ఊరికి వెళ్లే ముందు ఆ ఇంట్లో కొంత సొమ్ము దొంగతనం చేయవచ్చుననుకునే అక్కడికి వెళ్లానని, అయితే వృద్ధురాలు ఉమాదేవి కేకలు వేసినందునే కత్తితో దాడి చేసినట్లు చందానగర్‌లో జరిగిన హత్య కేసులో నిందితురాలు వసుంధర లక్ష్మి పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వెళ్లిన ఓ ఎస్సై తనను డాక్టర్‌గా పరిచయం చేసుకుని వివరాలు రాబట్టారు.
ఉమాదేవి క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. తాను ఉమాదేవి ఒంటిపై నగలు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న కత్తితో గొంతుపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించానంది. అయితే పోలీసులు, స్థానికులు ఇంటిని చుట్టుముట్టడంతో గత్యంతరం లేక కత్తితో తన కడుపులో పొడుచుకుంది. రక్తస్రావం కావడంతో పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా, శనివారం ఉదయం వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.