వట్టిసీమ
‘పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేశాం. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని పెన్నా నది వరకూ తీసుకువెళ్తాం. రాయలసీమకు నీళ్లిస్తాం’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చేస్తున్న ప్రకటన ఇది. ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నామని ముఖ్యమంత్రి ఘనంగా చెప్పుకుంటున్నారు. పథకాన్ని ప్రారంభించి రెండు నెలలు గడచిపోయింది. అయినా ఇప్పటివరకు పట్టుమని 12 టీఎంసీల నీటిని కూడా కృష్ణా నదిలోకి మళ్లించలేకపోయారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :గోదావరిలో వరద ప్రవాహం ఉండే 110 రోజుల్లో 80 టీఎంసీల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం కుడికాలువ పనులు, దానిపై ఉన్న బ్రిడ్జిలు, అండర్ టన్నెల్స్, అక్విడెక్టుల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఇప్పటివరకూ 5 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. గోదావరి నదిలో ఆగస్టు నెలాఖరు వరకే వరద ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత వరద వచ్చే అవకాశాలు లేవు. వరద లేనప్పుడు నీటి తరలింపు సాధ్యం కాదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించే పరిస్థితి కనిపించడం లేదు. రోజుకు పూర్తి సామర్థ్యంతో కనీసం 120 రోజులపాటు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పంపితేగాని లక్ష్యం పూర్తి కాదు. గోదావరిలో వరద ఉండే రోజులు ఎన్ని, ఎన్ని రోజులు నీరు ఇస్తారన్నది అనుమానమే. గత ఏడాది తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని సైతం గోపాలపురం మండలం గుడ్డిగూడెం రెగ్యులేటర్ దిగువన పోలవరం కుడి కాలువలో కలిపినా నాలుగు టీఎంసీలు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది 20 టీఎంసీలు మించే అవకాశం కనిపించడం లేదు. నీరు వదిలిన కొద్ది రోజులకే కృష్ణాజిల్లా రామిలేరు వద్ద గండి పడటంతో నీటి విడుదలను ఆపేశారు. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలకు ప్రకాశం బ్యారేజి వద్ద నీటిమట్టం 12 అడుగులు ఉండేలా చూడటం కోసం నీటిని నిల్వ చేశారు. ఆ తర్వాత కృష్ణాలో వరద రావడంతో మరికొన్ని రోజులు పట్టిసీమ నీటిని ఆపేశారు.
ఇవన్నీ లెక్కేసుకున్నా కృష్ణా డెల్టాకు 7నుంచి 8 టీఎంసీల నీరు కూడా వెళ్లలేదని సమాచారం. మధ్యలో డెల్టాకు నీరు లేక ఎండిపోతున్నాయంటూ జానంపేట వద్ద పైపులు వేసి 300 క్యూసెక్కుల వరకూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దొడ్డిదారిన తరలించుకుపోయారు. పట్టిసీమలో మొత్తం 24 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటార్ సామర్థ్యం 350 క్యూసెక్కులు. అన్ని మోటార్లను ఆన్ చేస్తే 8,400 క్యూసెక్కుల నీటిని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ గరిష్టంగా ఇచ్చింది 5 వేల క్యూసెక్కులకు మించి లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ నీటిని విడుదల చేస్తే పోలవరం కాలువకు గండ్లు పడటం ఖాయమని చెబుతున్నారు.
గుడ్డిగూడెం–గోపాలపురం మధ్య నాలుగు ప్రదేశాల్లో యూటీల నిర్మాణం పూర్తికాలేదు. గోపాలపురం–చిట్యాల మధ్య పోలవరం కాలువపై వంతెనల నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. యూటీలు నిర్మించాల్సిన ప్రదేశాల్లో మట్టితో పూడ్చి గట్లు పనులు చేస్తూనే ఉన్నారు. పెదవేగి మండలంలో 12 కిలోమీటర్ల మేర ఏటిగట్లు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ముండూరు నుంచి జానంపేట వరకూ ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.
జానంపేట అక్విడెక్ట్ వద్ద పనులు పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో కృష్ణాలో ఖరీఫ్‌కు పట్టిసీమ నుంచి మరో 7 నుంచి 8 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణా డెల్టాకు 20 టీఎంసీల నీటిని మాత్రమే తరలించే అవకాశం ఉన్న పట్టిసీమ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచుతూ వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు రూ.1,600 కోట్లు ముట్టజెప్పింది. ముడుపులపై ఉన్న మోజు పనులపై లేకపోవడంతో భారీఎత్తున నిధులు వెచ్చించినా లక్ష్యం నెరవేరలేదు.