ఏఎన్‌యూలో వీసీల బృందం పర్యటన
పలు విభాగాల పనితీరుపై అసంతృప్తి
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముగ్గురు సభ్యుల వీసీల బృందం మంగళవారం పర్యటించింది. డిసెంబర్ మొదటి వారంలో నాక్ బృందం ఏఎన్‌యూ పర్యటనకు రానున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించింది. ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్, నెల్లూరు విక్రమశింహపురి యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వీరయ్య, కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామకృష్ణారావు ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో వివిధ విభాగాలను సందర్శించారు. విభాగాల్లో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, అధ్యాపకుల గదుల్లో జరుగుతున్న మరమ్మతులు, ఆయా విభాగాల్లోని విద్య, పరిశోధన పరమైన అంశాలు , వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పలు అంశాలపై వీసీల బృందం సూచనలు చేసింది. పలు విభాగాల్లో పనులు కాకపోవటంపై వీసీల బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన నాక్ పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనివర్సిటీ వ్యవస్థ మొత్తం నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించింది. వివిధ విభాగాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి కాకపోవటం, కొన్ని విభాగాల్లో గదులు శుభ్రంగా లేకపోవంపై బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా పనిచేయకపోతే సహించేదిలేదని హెచ్చరించింది. చివరి నిమిషం వరకు పనులు పెండింగ్ పెట్టుకోవద్దని, రెండు రోజుల్లో అన్ని విభాగాలు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.