వేళాంగణిమాత ఉత్సవాలు ప్రారంభం
తోటపల్లిగూడూరు: కోడూరు వేళాంగణిమాత(మరియమాత) ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. కులమతాలకతీతంగా పూజలందుకొంటున్న వేళాంగణి మాత జన్మదినం సెప్టెంబర్ 8న పురష్కరించుకొని మూడు రోజుల పాటు వేళాంగణిమాత ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో మంగళవారం వేళాంగణి చర్చి డైరెక్టర్ ఫాదర్ తామస్ అగస్టీన్ ఆధ్వర్యంలో ప్రారంభ ప్రార్థనలు నిర్వహించారు. ‘దేవమాత వేళాంగణి అద్భుతాల మాత’ అనే అంశంపై భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం భక్తులు కోడూరు బీచ్‌లో సముద్ర స్నానాలను ఆచరించారు. సాయంత్రం సర్వాంగసుందరంగా కొలువుదీరిన వేళాంగణిమాత తేరు ప్రదక్షణ చర్చి నుంచి ముత్యాలతోపు పట్టపుపాళెం వరకు సాగింది.
ఉత్సవాల్లో నేడు
వేళాంగణిమాత ఉత్సవాల్లో బుధవారం ఉదయం 7గంటలకు జపమాల–నవదిన ప్రార్ధనలు, 9 గంటలకు ఆరాధన–స్వస్థత ప్రార్ధనలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సింహపురి పీఠాధిపతులు డాక్టర్ ప్రకాశం వేళాంగణిమాతకు దివ్యబలిపూజను సమర్పిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు అమ్మవారి చర్చి నుంచి కొత్తకోడూరు వరకు విగ్రహ తేరుప్రదక్షణ సాగుతుంది.