ఎల్లారెడ్డిపేట : మండలంలోని మద్దిమల్లకు చెందిన సంకెపల్లి సంతోష్(27)ను కంచర్ల శివారులోని వెంకట్రాయిని చెరువు వద్ద దారుణంగా హత్యచేసిన ఐదుగురు నిందితులను కరీంనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్రలు, బండరాళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ హత్య వివరాలను వెల్లడించారు. మద్దిమల్లకు చెందిన సంతోష్ వీర్నపల్లికి చెందిన పిట్ల గిరిబాబు స్నేహితులు. ఇద్దరి మధ్య డబ్బులు, వివాహేతర సంబంధాల విషయంలో విభేదాలు వచ్చాయి.
దీంతో 2016 జనవరి 4న సంతోష్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి గిరిబాబును హత్య చేసి సిరిసిల్ల శివారులోని మానేరు వాగులో మృతదేహం పూడ్చిపెట్టారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన సంతోష్ రెండు నెలలక్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. తన కొడుకును చంపిన సంతోష్‌పై గిరిబాబు తండ్రి అంజయ్య కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చాక రెండుసార్లు దాడి చేయగా సంతోష్ తప్పించుకున్నాడు.
ప్రతీకారంతో రగిలిపోతున్న అంజయ్య, కంచర్లకు చెందిన తన వియ్యంకుడు అబ్బనవేణి శంకర్, వీర్నపల్లికి చెందిన పిట్ల నర్సింలు, గంగాధర నాం పెల్లి, సామల ఎల్లయ్యతో కలిసి జూన్ 28న రాత్రి మద్దిమల్లలోని సంతోష్ ఇంటిపై దాడిచేశారు. ఇంటి వెనుక నుంచి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన అంజయ్య అటకపై దాక్కున్న సంతోష్‌ను కొట్టుకుంటూ వెంకట్రాయిని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. కర్రలు, గొడ్డలితో దాడిచేసి, తలపై రాళ్లతో మోది హత్యచేశారు. అనంతరం పారిపోయారు. ఐదుగురి నిందితులను సోమవారం తెల్లవారుజామున అల్మాస్‌పూర్ ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ శ్రీధర్, ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్‌ఐలు శంకర్, సలీం, సిబ్బంది పాల్గొన్నారు.
కొడుకును చంపినందుకే ప్రతీకారం
Published Tue, Jul 5 2016 8:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement