Yellareddypeta
-
అయ్యో! కోడికి ఎంత కష్టం వచ్చింది
సాక్షి, నాగిరెడ్డిపేట : కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ ధరలు ఆమాంతం తగ్గుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలు చికెన్‌కు దూరంగా ఉంటుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో సోమవారం జరిగిన వారాంతపు సంతలో 2కిలోల కోడిని రూ. 70కే విక్రయించారు. ఎల్లారెడ్డికి చెందిన కోళ్లఫారం యాజమాని ఒక ట్రాలీ ఆటోలో కోళ్లను తీసుకొచ్చి వారాంతపు సంతలో విక్రయించారు. తక్కువ ధరకు రావడంతో జనాలు కొనుగోలుకు ఆసక్తి చూపించారు. (ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) -
భార్య కాటికి.. భర్త పరారీ..
సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినా ద్యాగం మణెవ్వ, రాజయ్యల కూతురు పద్మ(33). కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన పడకంటి నారాయణతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. నారాయణ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో పుట్టింటికి వచ్చిన పద్మ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచకు చెందిన కొమురవెళ్లి ముత్యాలును రెండో వివాహం చేసుకుంది. పిల్లలు ప్రవళిక, పవన్‌కుమార్‌తో కలిసి రామంచలో నివాసం ఉంటున్నారు. తప్పని వేధింపులు.. పేదరికం వెంటాడుతుండడంతో పద్మను రెండోభర్త ముత్యాలు అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. మనస్తాపానికి గురైన పద్మ ఈనెల 4న అత్తవారి ఊరైన రామంచలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. హైదరాబాద్‌లోని గాం«ధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందింది. పద్మ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముత్యాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల భయంతో ఎక్కడికో పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు.. తల్లి మరణం.. ముత్యాలుపై కేసు నమోదుకావడంతో పద్మ పిల్లలు మానసిక దివ్యాంగురాలైన ప్రవళిక(14), పవన్‌కుమార్(12) దిక్కుతోచని స్థితిలోపడ్డారు. వీరి పెద్దమ్మ చేరదీసి వృద్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచింది. వారు బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పిల్లలను పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి పిల్లలకు డబుల్బెడ్రూం ఇల్లును మంజూరు చేసి పవన్‌కుమార్‌కు ప్రభుత్వ హస్టల్లో సీటు ఇప్పించి, మానసిక దివ్యాంగురాలైన ప్రవళికకు చేయూతను అందించాలని వృద్ధులైన మణెవ్వ, రాజయ్య కోరుతున్నారు. చిన్నారులను శనివారం ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, బాల్‌రాజ్ పరామర్శించారు. ఎమ్యెల్యే కేటీఆర్ ద్వారా ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు. -
కన్న కొడుకును చూడకుండానే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన ఓ గీతకార్మికుడిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. గల్ఫ్‌లో సంపాధించుకుందామని కోటి ఆశలతో వెళ్లిన అతడికి చావే శరణ్యమైంది. పనిచేస్తున్న కంపెనీవారు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం..ఇంటివద్ద అప్పుల వాళ్ల వేధింపులు అధికం కావడంతో మనోధైర్యం కోల్పోయిన కార్మికుడు గల్ఫ్‌లో పనిచేస్తున్న కంపెనీలోనే సహచర కార్మికుల సాక్షిగా శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్‌పూర్‌కు చెందిన బత్తిని శ్రీనివాస్‌గౌడ్ (38) అనే గీత కార్మికుడు మూడేళ్లక్రితం గల్ఫ్‌లోని బహెరాన్ దేశానికి రూ.2.50 లక్షలు అప్పుచేసి కంపెనీ విసాపై వెళ్లాడు. రెండేళ్లకు తిరిగి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తిరుగు వీసాపై ఏడాదిక్రితం రెండోసారి గల్ఫ్ వెళ్లాడు. కంపెనీలో పని అంతంత మాత్రంగానే ఉండడంతో చేసిన అప్పులు చెల్లించలేకపోయాడు. దీనికి తోడు నాలుగు నెలలుగా కంపెనీ నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. స్వగ్రామం నుంచి అప్పులు ఇచ్చినవారు ఫోన్ల ద్వారా బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడం, అక్కడ జీతాలు రాకపోవడంతో మరోమార్గం కానరాక పనిచేస్తున్న కంపెనీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ వెళ్లడానికి, కుటుంబ పోషణకోసం రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు రోడ్డునపడ్డారు. కన్న కొడుకును చూడకుండానే.. మృతుడు శ్రీనివాస్‌గౌడ్ తన కన్నకొడుకు ముఖం చూడకుండానే ఎడారి దేశంలో మృతిచెందడం అందరినీ కలచివేసింది. తండ్రి గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాతే కన్న కొడుకుకు నామకరణం (పేరు) చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోగా..కొడుకుకు నామకరణం చేయకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబసభ్యుల వేదనకు అంతు లేకుండా పోయింది. మృతునికి భార్య శ్యామల, కూతురు సహస్త్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సర్పంచ్ రాధారపు పుష్పల, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, గ్రామస్తులు కోరారు. -
సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సాంకేతికంగా నైపుణ్యం పెంపొందించుకోవాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బాలయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి హైదరాబాద్‌కు చెందిన భారతీ ఫౌండేష్ సంస్థ ఎల్లారెడ్డిపేట మండలంలోని 15 పాఠశాలలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మానవీయ విలువలతో జీవించే నిజమైన మనుషులను రూపొందించే వ్యక్తి నిర్మాణ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలు మారాలన్నారు. భారతీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలల్లో చదివే విద్యార్థులు వారు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాసచారి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అణుగుణంగా విశ్వస్థాయి పౌరులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి ఆంథోని ఢిల్లీ నుంచి స్కైఫ్ విడియోకాల్ ద్వారా ఉపాధ్యాయులతో మాట్లాడారు. అందరినీ భాగస్వాములను చేస్తూ విద్యార్థుల విద్యాస్థాయిని సంస్థ ద్వారా పెంపొందిస్తామన్నారు. ఈనె 23 నుంచి 26 వరకు మండలంలో దత్తత తీసుకున్న 15పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంఈవో మంకురాజయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొడుకును చంపినందుకే ప్రతీకారం
ఎల్లారెడ్డిపేట : మండలంలోని మద్దిమల్లకు చెందిన సంకెపల్లి సంతోష్(27)ను కంచర్ల శివారులోని వెంకట్రాయిని చెరువు వద్ద దారుణంగా హత్యచేసిన ఐదుగురు నిందితులను కరీంనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్రలు, బండరాళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ హత్య వివరాలను వెల్లడించారు. మద్దిమల్లకు చెందిన సంతోష్ వీర్నపల్లికి చెందిన పిట్ల గిరిబాబు స్నేహితులు. ఇద్దరి మధ్య డబ్బులు, వివాహేతర సంబంధాల విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో 2016 జనవరి 4న సంతోష్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి గిరిబాబును హత్య చేసి సిరిసిల్ల శివారులోని మానేరు వాగులో మృతదేహం పూడ్చిపెట్టారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన సంతోష్ రెండు నెలలక్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. తన కొడుకును చంపిన సంతోష్‌పై గిరిబాబు తండ్రి అంజయ్య కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చాక రెండుసార్లు దాడి చేయగా సంతోష్ తప్పించుకున్నాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న అంజయ్య, కంచర్లకు చెందిన తన వియ్యంకుడు అబ్బనవేణి శంకర్, వీర్నపల్లికి చెందిన పిట్ల నర్సింలు, గంగాధర నాం పెల్లి, సామల ఎల్లయ్యతో కలిసి జూన్ 28న రాత్రి మద్దిమల్లలోని సంతోష్ ఇంటిపై దాడిచేశారు. ఇంటి వెనుక నుంచి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన అంజయ్య అటకపై దాక్కున్న సంతోష్‌ను కొట్టుకుంటూ వెంకట్రాయిని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. కర్రలు, గొడ్డలితో దాడిచేసి, తలపై రాళ్లతో మోది హత్యచేశారు. అనంతరం పారిపోయారు. ఐదుగురి నిందితులను సోమవారం తెల్లవారుజామున అల్మాస్పూర్ ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ శ్రీధర్, ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్ఐలు శంకర్, సలీం, సిబ్బంది పాల్గొన్నారు.