సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందినా ద్యాగం మణెవ్వ, రాజయ్యల కూతురు పద్మ(33). కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన పడకంటి నారాయణతో 15ఏళ్ల క్రితం వివాహమైంది. నారాయణ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. పిల్లలతో పుట్టింటికి వచ్చిన పద్మ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచకు చెందిన కొమురవెళ్లి ముత్యాలును రెండో వివాహం చేసుకుంది. పిల్లలు ప్రవళిక, పవన్‌కుమార్‌తో కలిసి రామంచలో నివాసం ఉంటున్నారు.
తప్పని వేధింపులు..
పేదరికం వెంటాడుతుండడంతో పద్మను రెండోభర్త ముత్యాలు అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. మనస్తాపానికి గురైన పద్మ ఈనెల 4న అత్తవారి ఊరైన రామంచలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. హైదరాబాద్‌లోని గాం«ధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందింది. పద్మ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముత్యాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల భయంతో ఎక్కడికో పారిపోయాడు.
దిక్కుతోచని స్థితిలో చిన్నారులు..
తల్లి మరణం.. ముత్యాలుపై కేసు నమోదుకావడంతో పద్మ పిల్లలు మానసిక దివ్యాంగురాలైన ప్రవళిక(14), పవన్‌కుమార్(12) దిక్కుతోచని స్థితిలోపడ్డారు. వీరి పెద్దమ్మ చేరదీసి వృద్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచింది. వారు బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పిల్లలను పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి పిల్లలకు డబుల్‌బెడ్‌రూం ఇల్లును మంజూరు చేసి పవన్‌కుమార్‌కు ప్రభుత్వ హస్టల్‌లో సీటు ఇప్పించి, మానసిక దివ్యాంగురాలైన ప్రవళికకు చేయూతను అందించాలని వృద్ధులైన మణెవ్వ, రాజయ్య కోరుతున్నారు. చిన్నారులను శనివారం ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, బాల్‌రాజ్ పరామర్శించారు. ఎమ్యెల్యే కేటీఆర్ ద్వారా ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment