కన్న కొడుకును చూడకుండానే.. | Telangana Man Suicide In Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో అల్మాస్‌పూర్‌ వాసి ఆత్మహత్య

Published Sun, Apr 21 2019 8:59 AM | Last Updated on Sun, Apr 21 2019 8:59 AM

Telangana Man Suicide In Gulf - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్‌ వెళ్లిన ఓ గీతకార్మికుడిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. గల్ఫ్‌లో సంపాధించుకుందామని కోటి ఆశలతో వెళ్లిన అతడికి చావే శరణ్యమైంది. పనిచేస్తున్న కంపెనీవారు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం..ఇంటివద్ద అప్పుల వాళ్ల వేధింపులు అధికం కావడంతో మనోధైర్యం కోల్పోయిన కార్మికుడు గల్ఫ్‌లో పనిచేస్తున్న కంపెనీలోనే సహచర కార్మికుల సాక్షిగా శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్మాస్‌పూర్‌కు చెందిన బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌ (38) అనే గీత కార్మికుడు మూడేళ్లక్రితం గల్ఫ్‌లోని బహెరాన్‌ దేశానికి రూ.2.50 లక్షలు అప్పుచేసి కంపెనీ విసాపై వెళ్లాడు.

రెండేళ్లకు తిరిగి ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ తిరుగు వీసాపై ఏడాదిక్రితం రెండోసారి గల్ఫ్‌ వెళ్లాడు. కంపెనీలో పని అంతంత మాత్రంగానే ఉండడంతో చేసిన అప్పులు చెల్లించలేకపోయాడు. దీనికి తోడు నాలుగు నెలలుగా కంపెనీ నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. స్వగ్రామం నుంచి అప్పులు ఇచ్చినవారు ఫోన్ల ద్వారా బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడం, అక్కడ జీతాలు రాకపోవడంతో మరోమార్గం కానరాక పనిచేస్తున్న కంపెనీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్‌ వెళ్లడానికి, కుటుంబ పోషణకోసం రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య, పిల్లలు రోడ్డునపడ్డారు.

కన్న కొడుకును చూడకుండానే..
మృతుడు శ్రీనివాస్‌గౌడ్‌ తన కన్నకొడుకు ముఖం చూడకుండానే ఎడారి దేశంలో మృతిచెందడం అందరినీ కలచివేసింది. తండ్రి గల్ఫ్‌ నుంచి వచ్చిన తర్వాతే కన్న కొడుకుకు నామకరణం (పేరు) చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోగా..కొడుకుకు నామకరణం చేయకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబసభ్యుల వేదనకు అంతు లేకుండా పోయింది. మృతునికి భార్య శ్యామల, కూతురు సహస్త్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సర్పంచ్‌ రాధారపు పుష్పల, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకర్, గ్రామస్తులు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement