‘పట్టణ అద్దె ఇళ్లు’ పాలసీ మాత్రమే
లోక్‌సభలో ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి వెంకయ్య సమాధానం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జాతీయ పట్టణ అద్దె ఇళ్ల విధానం చట్టం కాదని.. బిల్లు కూడా కాదని.. ఒక పాలసీ మాత్రమేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు గురువారం లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టణ గృహాలపై కిరాయి మద్దతు ధరను ఏమైనా తీసుకుందా..? అని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. అలాగే రెంటల్ హౌసింగ్ పాలసీ కింద వివిధ వర్గాల నుంచి ఏమైనా సూచనలు, పట్టణ గృహ యజమానులు, కిరాయిదారులకు ట్యాక్స్ మినహాయింపు కోసం వచ్చాయా..? వాటి వివరాలను వెల్లడించాలని కోరారు.
దీనిపై కేంద్రమంత్రి సమాధానమిస్తూ అద్దె మార్కెట్‌లోని గిరాకీ, సరఫరా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుందని, టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం ముంబై రీజియన్, జాతీయ రాజధాని ప్రాంతాల్లో ఆస్తి పెట్టుబడుల మీద రెండు నుంచి మూడుశాతం కిరాయిలు ఇవ్వవచ్చని తెలిపారు.