గన్నవరం: కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని భారత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను టెర్రరిస్టుల దేశంగా ప్రకటించాలని కోరారు. కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్టులో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
పాక్ ఉగ్రవాద చర్యలను వెంకయ్య తీవ్రంగా ఖండించారు. యూరి సెక్టార్‌లో జరిగిన ఈ దాడిలో 18మందికిపైగా భారత సైనికులు మృతి చెందడం విచారకరమన్నారు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ, శిక్షణ, నిధులు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని బలహీనపర్చేందుకు కుయుక్తులు పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశమైనందున మంచి స్నేహ సంబంధాలు ఉండలనే సదుద్దేశంతో గత యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ ప్రధానిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంతో పాటు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి లాహోర్ జరిగిన పాక్ ప్రధాని కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
అయితే పాక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం సరికాదని హితవుపలికారు. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లో దుశ్చర్యలకు దిగి, సైనికులను పొట్టనపెట్టుకోవడం క్షమించరాని నేరమన్నారు. ప్రపంచ దేశాలు పాక్ చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. దీనిని టైస్టు దేశంగా ప్రకటించి, అన్ని రకాల సహాయ సహకారాలను నిరాకరించాలని కోరారు. అప్పుడే పాక్ తన దుష్టయత్నాలను మానుకుంటుందని వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
‘పాకిస్తాన్ ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలి’
Published Mon, Sep 19 2016 7:17 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement