గుంటూరుకు వెంకన్న బస్సులు
గుంటూరుకు వెంకన్న బస్సులు
Published Sat, Nov 5 2016 5:17 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
* ప్రతి ప్రాంతానికి నడపాలని యోచన
* ప్రతిపాదనలు పంపిన ఆర్టీసీ ఆర్‌ఎం
* త్వరలో 30 బస్సులు వచ్చే అవకాశం
గుంటూరు (పట్నంబజారు): గుంటూరు నగరవాసులకు శుభవార్త. ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో రోడ్లపై మినీ సిటీ బస్సులను నడపనుంది. గతంలో రీజియన్‌కు నూతనంగా వచ్చిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులను అధికారులు నగరంలో తిప్పే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రధాన ప్రాంతాలకు సిటీ బస్సులను తిప్పేందుకు యోచిస్తున్నారు. ఇందుకుగాను తిరుమల కొండపై నిత్యం తిరిగే మినీ బస్సులు కావాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇవి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులకు బ్రేక్..
ఏడాది కిందట ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి గోదావరి పుష్కరాల అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా 15 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సిటీ బస్సులను నగరంలో తిప్పేందుకు ఏర్పాట్లు చేశారు. అనుకున్న స్థాయిలో సిటీ బస్సులు ఆదరణకు నోచుకోకపోగా నష్టాలు రావడం మొదలయ్యాయి. దీనికితోడు నగరంలో రోడ్లు ఇరుకిరుగ్గా ఉండడం వల్ల భారీగా కనిపించే ఆ బస్సులను టర్నింగ్ తీసుకోవడంలో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడ్డారు. అప్పటికే నష్టాలబాటలో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాలను చవిచూడడం ఇష్టంలేక నిండా రెండు నెలలు కూడా కాకుండానే సిటీ సర్వీసులను రద్దుచేసింది. పాతగుంటూరు, కొత్తపేట, నెహ్రూనగర్, రెడ్డిపాలెం, సంజీవయ్యనగర్, ఆర్టీసీ కాలనీతో పాటు పలు ప్రాంతాల ప్రజలు అనేకమార్లు నగరంలో సిటీ బస్సులు తిప్పాలని అధికారులకు విన్నవించిన సందర్భాలున్నాయి. ప్రయాణికుల విన్నపానికి స్పందించిన ఆర్‌ఎం గత అనుభవాలను అధ్యయనం చేసి.. తిరుమలపై కొండపై తిరిగే టీటీడీకి చెందిన సప్తగిరి మినీ బస్సులయితే బాగుంటాయని ఆలోచించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి 30 బస్సులు కావాలని అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో నగర రోడ్లపై సప్తగిరి సిటీ బస్సులు తిరగనున్నాయి.
అందరికీ అందుబాటులో..
నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు దృష్టి సారిస్తున్నాం. సిటీ బస్సు తమ ప్రాంతానికి రావాలనుకునే ప్రతి ప్రయాణికుడి కలను త్వరలోనే నెరవేరుస్తాం. మారుమూల ప్రాంతాల నుంచి నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతాలకు సిటీ బస్సులు వెళతాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్‌ఎం
Advertisement
Advertisement