
పరిశ్రమల పునరుద్ధరణకు కృషి
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస
హిందూపురం అర్బన్ : రాయలసీమలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ కోసం మండలిలో తన వాణి వినిపిస్తానని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏదైనా పోరాటంతోనే సా«ధ్యమవుతుందన్నారు. తనను గెలిపిస్తే రాయలసీమలో మూతబడ్డ పరిశ్రమల పునరుద్ధరణపై మండలిలో ప్రశ్నిస్తానన్నారు. హిందూపురం సమీపంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పెనుకొండ ఆల్వీన్ పరిశ్రమ, కర్నూలులో పేపర్ ఫ్యాక్టరీ, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తానని చెప్పారు.
మూతపడిన పరిశ్రమలు ప్రారంభించలేని చంద్రబాబు కొత్త పరిశ్రమలు ప్రారంభించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ గోపాల్‌రెడ్డి ఎన్జీఓ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు.. రాయలసీమ ప్రాంత పరిస్థితులపై అవగాహన కల్గిన వ్యక్తి అన్నారు. గోపాల్‌రెడ్డి గెలుపుతో అధికార టీడీపీకి తగిన బుద్ధి వస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమన్, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు.