- ప్రత్యేకహోదా, రైల్వేజోన్, సీపీఎస్ రద్దు కోసం పోరాటం
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
గుంతకల్లు టౌన్ : ‘రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని, ఉద్యమకారుల్ని హింసలకు గురిచేస్తోంది. ఈ అరాచక, అవినీతి, అబద్దాల ప్రభుత్వానికి మీ విలువైన ఓటుతో బుద్ధి చెప్పండి’ అని పట్టభద్రుల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంతకల్లుకి విచ్చేసిన ఆయన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాపులను బీసీల్లోకి, రజకులను ఎస్సీల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీల సా«ధన కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ, ఆయా వర్గాల వారిని పోలీసుల చేత అణచివేయించడం దారుణమన్నారు. తాము గెలిస్తే అనేక పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని టీడీపీ అభ్యర్థి కే జే రెడ్డి ప్రచారం చేయడం యువతను మభ్యపెట్టడమేనన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు వాగ్ధానాలకే అతీగతీ లేదన్నది యువత గుర్తుంచుకోవాలన్నారు. పైగా ఎలాంటి చట్టబద్దత లేని పార్టీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో నిరుద్యోగ భృతి ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు లీకులిచ్చి చంద్రబాబు పగటివేషగాడినని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గుంతకల్లులో మూతపడిన ఏసీఎస్ మిల్లు, హిందూపురంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ, పెనుకొండలోని ఆల్విన్, కర్నూల్‌లోని పేపర్‌మిల్లును పునః ప్రారంభించేందుకు ప్రభుత్వంతో పోరాడుతానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయించడంతో పాటు స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతతోనే గ్రూప్–డి పోస్టుల భర్తీ, అప్రెంటీస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుకై ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్ మాబు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సుధాకర్, మోహన్‌రావు, కౌన్సిలర్లు అహ్మద్‌బాషా, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రలోభాలకు మోసపోకండి
మూడేళ్ల అధికారంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు సర్కారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువతను ప్రలోభాలకు గురిచేసేందుకు కుట్రపన్నుతోందని పార్టీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఒక రోజు ఆనందం కోసం ప్రలోభాలకు గురైతే ఆరేళ్లు నానా ఇబ్బందులు పడటం ఖాయమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మికులందరినీ నిలువునా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పి, వెన్నపూసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బాబుకు ఓటుతో బుద్ధి చెప్పండి
Published Wed, Mar 1 2017 12:39 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement