వేటు మొదలైంది
వేటు మొదలైంది
Published Tue, Dec 20 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమార్కులపై వేటు మొదలైంది. పెద్ద నోట్ల రద్దును అడ్డం పెట్టుకుని నగదును దొడ్డిదారిన బయటకు పంపించి.. నల్ల కుబేరులకు సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు మొదలు కావడంతో ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లను అందించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ప్రధాన బ్యాంకుల్లో ఆడిటింగ్ మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాంచిలపై ఆర్‌బీఐ, ఐటీతోపాటు సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. తాజాగా తణుకు ఎస్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్‌బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పెద్ద నోట్ట రద్దు అనంతరం నగదు చెల్లింపుల్లో నిబంధనల్ని బేఖాతరు చేయడంతోపాటు కొందరు నల్లకుబేరులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆర్‌బీఐ అధికారులు ఆ బ్యాంకులో విస్తృత సోదాలు నిర్వహించి, అక్రమాలు జరిగినట్టు తేల్చడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో కొత్తనోట్లు బయటపడ్డాయి. పకడ్బందీగా ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు వచ్చిన ఈ నోట్లు బయటకు ఎలా వెళుతున్నాయనే దానిపై ఇప్పటికే విచారణ మొదలైంది. బ్యాంకు మేనేజర్లకు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీషన్ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు మార్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏలూరులో రూ.24 లక్షలు మార్చుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. తర్వాత ఏలూరు వన్‌టౌన్‌లో సూర్యా అపార్ట్‌మెంట్‌లో ఎలబాక బాలకృష్ణ నుంచి రూ.19 లక్షల నగదు చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో ఆర్‌బీఐæ అధికా రులూ విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
రోజులు గడుస్తున్నా అవే కష్టాలు
పెద్దనోట్ల రద్దుతో కష్టాలు మొదలై 41 రోజులు గడిచాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పేదలు, సామాన్యులు బారులు తీరుతూనే ఉన్నారు. భీమవరం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద బ్యాంకు తెరవక ముందే జనం బారులు తీరి కనిపించారు. చంటి పిల్లలతో తల్లులు, నిలబడే ఓపికలేని వృద్ధులు పడిగాపులు పడుతూ కనిపించారు. భీమడోలు ఎస్‌బీఐ వద్ద నేటికీ రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. నరసాపురంలో ఉదయం నుంచే బ్యాంకుల ఎదుట జనం క్యూ కట్టారు. నరసాపురం పట్టణం, మండలం, మొగల్తూరు మండలంలో ఎక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో నగదు లేదని బోర్డులు పెట్టారు. ఆంధ్రాబ్యాంకులో నగదు లేదని చెప్పడంతో ఖాతాదారులు నిరాశ చెందారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడలేక ఖాతాదారులు వారి పాదరక్షలను లైన్‌లో పెట్టి సమీపంలో షాపుల వద్ద వేచి ఉంటున్నారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు, బొర్రంపాలెం సిండికేట్ బ్యాంకుల్లో సోమవారం నగదు చెల్లింపులు జరగలేదు. మక్కినవారిగూడెం ఒక్కొక్క ఖాతాదారుడికి రూ.2 వేల చొప్పున 100 మందికి రూ.2 లక్షలు పంపిణీ చేశారు.
Advertisement