అనంతపురం ఎడ్యుకేషన్ : ఎవరైనా పేదవాళ్లు కరెంటును అక్రమంగా వాడుకుంటే వేలాది రూపాయలు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేసే విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కేంద్రంలోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో యథేచ్చగా కరెంటును అక్రమంగా వాడుకుంటున్నా కనిపించడం లేదు. విద్యుత్‌నగర్ సర్కిల్‌లో ఉన్న ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాన్ని ఇటీవల టీవీ టవర్ వెనుకకు మార్చారు. పీఓ చాంబర్, ఇంజినీరింగ్ విభాగానికి పక్కా కరెంటు ఉంది. అయితే ఎఫ్‌ఏఓ, జీసీడీఓ, సీఎంఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, ఐఈడీ కోఆర్డినేటర్, అకడమిక్ మానటరింగ్ అధికారి, అలెస్కో విభాగాల గదులతో పాటు సమావేశ హాలుకు కరెంట్ సదుపాయం లేదు. దీంతో అక్రమంగా కరెంటు తీగలకు కొక్కీలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయితే కరెంటు కనెక‌్షన్ కోసం ఇటీవల విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. వారి నుంచి ఇంకా అనుమతులు రాలేదు.
కొక్కీలు తగిలించి..
తమదీ ప్రభుత్వ కార్యాలయమే కదా? ఏమవుతుందిలే అనుకున్నారో ఏమోకాని ఎంచక్కా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటును వాడుకుంటున్నారు. ఇటీవల ఓరోజు అక్రమంగా కరెంట్ వాడుతున్న విభాగాలకు కరెంటు సరఫరా ఆగిపోయింది. ఒకరిద్దరు సిబ్బంది నేరుగా విద్యుత్ అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరారు. ఫలానా స్తంభం నంబరు చెప్పగానే అవతలి నుంచి గట్టిగా స్పందించడంతో కంగుతినడం వీరి వంతైంది. అనుమతి తీసుకోకుండా దొంగ కరెంటు ఎలా వాడుతున్నారంటూ విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి పరిశీలించి జరిమానా వేస్తామని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేయడం ఇవతలివారి వంతైంది. ఇదండీ ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో విద్యుత్ చౌర్యం తీరు.
అలా వాడడం తప్పే
అనుమతి లేకుండా విద్యుత్ తీగలకు కొక్కీలు తగిలించి కరెంటు వాడుకోవడం తప్పే. కరెంటు సరఫరా లేకపోతే ఉన్న విభాగాల నుంచి తీసుకోవాలి తప్ప అలా నేరుగా కరెంటు స్తంభం నుంచి తీసుకోకూడదు. నేను కొత్తగా విధుల్లోకి వచ్చా. నాకు విషయం తెలీదు. మా సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. – సుబ్రహ్మణ్యం, పీఓ
ఎస్‌ఎస్‌ఏలో విద్యుత్ చౌర్యం
Published Sun, Jul 2 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
Advertisement
Advertisement