విత్తన దుకాణాలపై విజి‘లెన్స్’
విత్తన దుకాణాలపై విజి‘లెన్స్’
Published Wed, Jun 14 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
తణుకు : తణుకు పట్టణంలోని విత్తనాలు విక్రయించే దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ కె.బాలవెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ కె.అనిల్‌కుమార్, సీఐ ఎస్.వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. రాష్ట్రపతి రోడ్డులోని గ్రంధి సీతయ్య సీడ్స్, గ్రంధి చలమయ్య సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులు, నిల్వలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. గ్రంధి చలమయ్య సీడ్స్‌లో రూ.4.64 లక్షలు, గ్రంధి సీతయ్య సీడ్స్‌లో రూ.3 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నకిలీ విత్తనాల వ్యవహారంతో తణుకులో విత్తనాల దుకాణాలపై ఈ దాడులు నిర్వహించారు. గతంలో సైతం తణుకులో కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవిగా తేలడంతో పెద్ద ఎత్తున రైతులు ఏపీ సీడ్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలోనే పెద్ద మొత్తంలో విత్తనాల వ్యాపారం జరిగే తణుకు పట్టణంలో నిర్వహించిన విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాల అంశాన్ని పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పలు బ్రాండ్లకు చెందిన విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వీటిని నకిలీవా లేక అసలువా తేల్చేందుకు లాబొరేటరీకి పంపించాల్సి ఉందన్నారు. దుకాణాల యజమానులు జీవీఎన్ భూషణం, జి.వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, ఏసీటీవో డీడీ రాజేంద్రప్రసాద్, ఏజీ జయప్రసాద్, ఏవో ఎం.శ్రీనివాస్‌కుమార్, మండల వ్యవసాయాధికారి బి.ప్రియదర్శిని, హెడ్‌కానిస్టేబుళ్లు పి.రాధాకృష్ణ, కె.నాగరాజు, వైఎన్ మూర్తి, నాగబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement