
కాల్ యముళ్లు
♦ మహిళలపై ఆకర్షణ వల.. ఆపై రాసలీల
♦ నిరాకరిస్తే బెదిరింపులు అధికార పార్టీ అండతోనే అంతా
♦ చీకటి దందాకు టాస్క్‌ఫోర్‌స పోలీసుల చెక్
విజయవాడ సిటీ : ‘పుట్టిన రోజుల పేరిట పార్టీలు.. పెళ్లి రోజుల పేరిట కానుకలు.. మాటల గారడీతో లోబరుచుకోవడం.. ఆపై కోర్కెలు తీసుకోవడం.. మీకు తెలిసినవాళ్లను తీసుకురాకుంటే వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులు’ .... ఇవీ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠా లీలలు. అధికారులు, పేరున్న రాజకీయ నేతల అండదండలతో ఐదేళ్లుగా సాగిస్తున్న వీరి దందాకు ఎట్టకేలకు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ అడ్డుకట్ట వేశారు. కాల్‌మనీ మనీ పేరిట తెలుగు తమ్ముళ్లు నడిపిస్తున్న ఈ రాకెట్ వెనుక బడా వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం చూసి పోలీసు అధికారులు నివ్వెరపోయారు.
అదుపులోకి తీసుకున్న వెంటనే అధికార పార్టీ నేతలు, ఉన్నత అధికారుల నుంచి పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిసింది. వీరి అభ్యర్థనను సున్నితంగా తోసిపుచ్చిన పోలీసు అధికారులు కూకటివేళ్లతో సహా ముఠాలను పెకిలించేయాలని నిర్ణయించారు. ‘వీళ్ల రాక్షస క్రీడ చూస్తే రక్తం మరుగుతోంది. ప్రతి ఒక్కరికీ అమ్మ, అక్కచెల్లెళ్లు, కూతుళ్లు ఉంటారు. వీరు ఏ ఒక్కరినీ వదలకుండా అనుభవిస్తున్నారు’ అంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారంటే వీరి అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పెద్దోళ్లకు ఎర
పై స్థాయిలో పలుకుబడి పెంచుకొని పైరవీలు చేసేందుకు మహిళలు, యువతులను సరఫరా చేస్తుంటారు. తాము లోబరుచుకున్న మహిళలను పెద్దోళ్లకు ఎరగా వేసేందుకు వీరు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా మహిళలను మత్తులో ముంచి నగ్న చిత్రాలు తీస్తారు. ఆపై తాము చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లాలంటూ ఆదేశిస్తారు. వ్యతిరేకిస్తే వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులకు దిగుతారు. తద్వారా తమ మాట వినేలా చేసి హోటళ్లు, అతిథి గృహాలకు పంపి అవసరమైన వ్యక్తుల నుంచి కావాల్సిన పనులు చేయించుకుంటారు.
బౌన్సర్ల రక్షణ
చీకటి క్రీడలు నిర్వహించే వీరంతా బౌన్సర్లను రక్షణగా పెట్టుకున్నారు. ముఠాకు నేతృత్వం వహిస్తున్న యలమంచిలి రాముకు ఆరుగురు బౌన్సర్లు రక్షణగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మాట వినని వారిని రూమ్‌లోకి తీసుకెళ్లి బౌన్సర్లతో బడితె పూజ చేయించి బెదిరిస్తారు. ఈ రాకెట్‌లోని వ్యక్తులందరూ సాయంత్రం అయ్యేసరికి ఖరీదైన కార్లలో పంటకాలువ రోడ్డులోని రాము కార్యాలయానికి చేరుకుంటారు తెల్లవార్లు వీరి కార్యకలాపాలు సాగిస్తారు. ఇలాంటివి నచ్చని ఇంటి యజమాని ఖాళీ చేయమన్నందుకే దాడి చేసి పోలీసుల సహకారంతో ఎదురు కేసు పెట్టారు.
ఐదేళ్లుగా చీకటి దందా
ఐదేళ్లుగా యలమంచిలి రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి చీకటి దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అవసరాల్లో ఉన్న వారికి వడ్డీకి డబ్బులిస్తూ లోబరుచుకుని చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా వేసి లోబరుచుకుంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన యుక్త వయస్సు మహిళలను తీసుకొచ్చి అప్పగించాలి. లేదంటే గదిలో పెట్టి కొడతారు. వారుంటున్న పరిసర ప్రాంతాల్లో అందమైన యువతులను తీసుకొచ్చి వీరి కోర్కెలు తీర్చాలి. లేదంటే కుటుంబం పరువు తీస్తామంటూ బెదిరిస్తారు. వారిపై మొహం మొత్తాక వేర్వేరు ప్రాంతాల్లోని తమ అనుచరుల వద్దకు వీరిని పంపుతారు. అక్కడ వారు లోబరుచుకున్న యువతులను ఇక్కడికి రప్పించుకుంటారు. ఐదేళ్లుగా వీరు ఇదే తరహా దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
నిర్భయంగా రండి
మహిళలపై జరిగే లైంగిక వేధింపులను ముఖ్యమంత్రి అంగీకరించరు. ఇలాంటివారిని కఠినంగా దండించాలనేది ఆయన ఆలోచన. కాబట్టి బాధిత మహిళలు, యువతులు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. భయపడాల్సిన అవసరం లేదు. మహిళలకు మాదే భరోసా.
- గౌతమ్ సవాంగ్,
పోలీసు కమిషనర్, విజయవాడ