
మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
- గ్రామ పంచాయతీలకు బాధ్యులను కేటాయిస్తాం
- వీసీలో కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్: మొక్కలు నాటడం, వాటి రక్షణ, పెంపకం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని, ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం హరితహరం పురోగతిపై మండలాల వారీగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామ, మండల స్థాయి అధికారులు సూక్ష్మస్థాయిప్రణాళికను రూపొందించుకొని మొక్కలను నాటించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి బాధ్యులను కేటాయిస్తామని, నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి రక్షించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్ల వెంట, కమ్యూనిటీ స్థలాలు, శ్మశానవాటికలు, చెరువుగట్లపై మొక్కలు వేసేందుకు సామాజిక వన విభాగం నర్సరీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటి ఆవరణలో వేసుకునేందుకు ప్రతి ఇంటికి ఒక మామిడి, కొబ్బరి, మునగ, నేరేడు వంటి మొక్కలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డ్వామా నుంచి 25లక్షల టేకు మొక్కలను పంపిణీ చేశామని, 10 లక్షల మొక్కలు నాటించాలని సూచించారు. అదనంగా టేకు, పండ్ల మొక్కలను రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు వివరించారు. మొక్కల రవాణాకు ప్రతి మండలానికి రూ.20 వేలు విడుదల చేస్తున్నామని, కార్యక్రమ తీరును రాష్ట్ర, జిల్లా అడిట్ బృందాలు తనిఖీ చేస్తాయని తెలిపారు. వ్యక్తిగత మరుగుడొడ్లకు సంబంధించి గతంలో ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి జిల్లాలో 17 వేల మరుగుదొడ్లు మంజూరు కాగా, ఎనిమిది వేలు పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి 13 వేలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి 46 వేల మరుగుదొడ్లను మంజూరు చేసినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటి సీఈఓ కర్నాటి రాజేశ్వరి పాల్గొన్నారు.