ఊరు పొమ్మంది.. పట్నం రమ్మంది
♦ ఉపాధికరువై వలసబాట పడుతున్న పల్లెజనం
♦ ఖాళీ అవుతున్న గిరిజన తండాలు
యాలాలకు చెందిన గొల్ల శ్రీను కౌలు రైతు. ఏడాది నుంచి తీవ్ర వర్షాభావంతో పంటలు పండలేదు. గ్రామంలో ఉపాధి కరువైంది.. వారం క్రితం కుమారుడు ఈశ్వర్, కూతురు మల్లికను వికారాబాద్‌లోని అత్తగారింట్లో వదిలి పెట్టి వచ్చాడు. భార్య కేశమ్మతో కలిసి దినసరి కూలీ పనుల కోసం హైదరాబాద్‌కు పయణమయ్యాడు.
ఉన్న ఊర్లో ఉపాధి కరువై, భార్యాబిడ్డలను పోషించుకోలేని స్థితిలో అన్నదాతలు ఉపాధి వెతుక్కుంటూ వెళ్తున్నారు. తీవ్ర వర్షాభావం అప్పుల ఊబిలోకి నెట్టడంతో కన్న పేగులకు పట్టెడన్నం పెట్టలేక కడుపుచేత పట్టుకుని పట్నానికి పయనమవుతున్నారు. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వరుసగా మూడు నాలుగేళ్లుగా కరువు రావడంతో రైతులకు, వ్యవసాయ కూలీలకు గ్రామాల్లో ఉపాధి కరువైంది. దీంతో ముంబై, పూణేలకు వలస వెళ్తున్నారు. తాండూరు డిపో నుంచి రోజూ ముంబైకి ఓ బస్సు వెళ్తుండగా, మరో రెండు ఇతర డిపోల బస్సులు గండేడ్ మీదుగా కిక్కిరిసి వెళ్తున్నాయంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గిరిజన తండాల నుంచి జనం ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు.
గండేడ్: వ్యవసాయ భూములు ఎడారిగా మారడంతో, ఉపాధికరువై కుటుంబాలను సాకేందు కు బతుకుదెరువు కోసం పట్టణాలకు బయలుదేరుతున్నారు పల్లెవాసులు, గిరిజనులు. మండల పరిధిలో 80 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాగునీరు లేక భూములు బీళ్లుబారిపోయాయి. గ్రామాల్లో ఉపాధిదొరక్క పిల్లాపాపలతో పట్టణాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సుమారు 25శాతం మంది వలసలబాట పట్టారు. మండలం నుంచి రోజుకు మూడు ఆర్టీసీ బస్సులు పుణేకు, ముంబైకి వెళతాయి. వాటిలో ప్రతిరోజు 150 మందికి పైగా మండల ప్రాంతం నుంచి పనులు వెతుక్కుంటూ వెళ్తున్నారు.
ఖాళీ అవుతున్న తండాలు..
మండలవ్యాప్తంగా 45 గిరిజన తండాలు ఉన్నాయి. వాటిలో 20వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఉపాధి దొరక్క పిల్లాపాపలను, వృద్ధులను వదిలి పుణే, ముంబై వలస వెళ్లారు. ఇప్పటికే తాండాల్లో సగానికి పైగా వలసబాటపట్టారు. ఏ తండాలో చూసినా ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి.
కుల్కచర్ల: ప్రభుత్వం వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం సైతం కూలీలకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉన్నఊరు, కన్నవారు, కనిపెంచిన పిల్లలను వదిలి తప్పనిసరి పరిస్థితుల్లో పుణే, ముంబై తదితర పట్టణాలకు వలస పోతున్నారు. మండలంలో 29 పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, 102 వరకు తండాలు ఉన్నాయి. 81 వేల వరకు జనాభా ఉంది. ఇందులో ప్ర స్తుతం 50 శాతం మంది వలసబాట పట్టారు. తండాల్లో ఎక్కడ చూసినా వృద్ధులు, వారి దగ్గర చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. మండల కేంద్రం నుంచి నిత్యం ముంబైకి బస్సు వెళ్తుంది. ఈ బస్సు చాలకపోవడంతో నిత్యం ప్రైవేటు జీపులను ఆశ్రయిస్తున్నారు.
చేనేతకు చేయూత కరువై..
యాలాల: మండలంలో మొత్తం 24 పంచాయతీలుండగా, 13 గిరిజన తండాలున్నాయి. మండల కేంద్రంతో పాటు అనుబంధ గ్రామమైన గోవిందరావుపేట చేనేత కార్మికులకు పెట్టింది పేరు. అప్పట్లో చేనేత పనులతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ ఊరు ప్రస్తుతం వలసబాట పట్టింది. చేనేత పనులకు ఆదరణ తగ్గిపోవడంతో ఇక్కడి చేనేత కార్మికులు వలసదారులుగా మారారు. కొందరు తమ కుటుంబాలతో సహా నగరాలకు వలస వెళ్లగా, వృద్ధులు బీడి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది చేనేతలతో పాటు ఆటోడ్రైవర్లు, వ్యవసాయంపై ఆధారపడిన వారు నగరాలకు వలసబాట పట్టారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, పుణే, ముంబై, షోలాపూర్, బీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిలో భవన నిర్మాణ కూలీలుగా, దినసరి కూలీ పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. గిరిజన తండాల్లో మహారాష్ట్ర పాంతానికి వలస వెళ్లినవారు అధికంగా ఉన్నారు.
నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. వర్షాలు ముఖం చాటేయడంతో కరువు ముంచుకొచ్చింది. పుట్టిపెరిగిన ఊళ్లో ఉపాధి కరువైంది. చేసేదిలేక పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. విధిలేక బతుకుదెరువుకోసం పిల్లాపాపలను తీసుకొని.. ఇళ్లకు తాళాలు వేసి భారమైన హృదయం తో గ్రామాలను వీడుతున్నారు. మరికొందరు పెద్దవాళ్లను ఇళ్లవద్దే వదిలి వలసపోతున్నారు. నిత్యం వందలాదిమంది పుణే, ముంబై తదితర ప్రాంతాలకు పయనమవుతున్నారు.
చేసేందుకు పనిలేక ..
మాది పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడ్డ కుటుంబం. పనిలేకపోవడంతో నా ఇద్దరు కొడుకులు, కోడళ్లంతా పుణేకు వలసవెళ్లారు. వారి పిల్లలను, నన్ను ఇంటిదగ్గరే వదిలి వెళ్లిపోయారు. పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే కాలం గడుపుతున్నాను. మా తండాలో 70శాతం మంది వలస వెళ్లిపోయారు. - ధర్మిబాయి, పంచలింగాల్ తండా
కుటుంబం గడవదు..
ఉన్న బోరుబావులు ఎండిపోయాయి. వ్యవసాయం చేయలేక పిల్లలతో కలిసి ముంబైకి వెళ్తున్నాను. చుట్టు పక్కల తండాల్లో ఉన్న మా బంధువులంతా పుణే, ముంబై వెళ్లిపోయారు. ప్రభుత్వం ఆదుకోవడం లేదు. నేనూ వెళ్లకుంటే నా కుటుంబం గడిచేలా లేదు. అందుకే పని వెతుక్కుంటూ వెళ్తున్నా. - కె.తులసీరాం, కోల్‌బాయి తండా
పరీక్షల తర్వాత నేనూ వెళ్తా..
ఇంటి దగ్గర నేను, మా అవ్వ మాత్రమే ఉంటున్నాం, మా అ మ్మానాన్నలు పుణేలో ఉంటున్నారు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేస్తున్నారు. నేను పదోతరగతి చదువుతున్నాను. పరీక్షలు అయిన తరువాత నేను కూడా పోవాలె. - అనిల్, బింద్యం గడ్డ తండా
8 నెలలు అక్కడే ఉంటాం.
రెండేళ్లుగా వర్షాలు లేక పంటలు పండలేదు. ఇక్కడ ఏ పనీలేదు. ఉపా ది పని చేస్తే ఇప్పటివరకు కూలీ రాలేదు. ఇక్కడే ఉంటే కుటుంబం గడవడం కష్టం. వర్షాకాలం ఇక్కడ ఉండి మిగతా 8 నెలలు పుణేకు పోయి పనులు చేసుకుంటాం. - హన్మయ్యనాయక్, నేరేర్లకుండ
తండా మొత్తం ఖాళీ..
మా తండాలో మొత్తం 250 మంది ఉంటారు. ఇందులో 200 మంది పుణేకు వలస పోయారు. ప్రస్తుతం వృద్ధులు, పిల్లలు కలిపి 50 మంది వరకు మాత్రమే ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా పంటలు లేవు. చాలా తండాల్లో ఇదే పరిస్థితి. - రాజేందర్, టేకులతండా