వలస బాటలో పల్లె జనం
‘ఉపాధి’ లేక పయనం
వర్షాభావం, ‘ఉపాధి’ లేకపోవడమే కారణం
పనిలేక.. పొట్ట కూటి కోసం పల్లె జనం పట్నం బాట పడుతున్నారు.. పదుల సంఖ్యలో ఊళ్లు.. వందల సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్తున్నా యి.. ఫలితంగా పల్లెలు బోసిపోతున్నారుు.. ఏ ఇంటిని చూసినా తాళాలు దర్శనమిస్తున్నారుు.. కులవృత్తులు లేక చిరు వ్యాపారం చిన్నబోతోంది..పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు మినహా ఎవరూ కనిపించడం లేదు..! దీనికి ప్రధాన కారణం.. ‘ఉపాధి’ లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. జిల్లాలో వలస వెళ్లిన పల్లెలపై కథనాలు..
తాళం వేసి ఉన్న ఈ ఇల్లు పాలకుర్తి మండల కేంద్రంలో గీత కార్మిక కుటుంబానిది. కమ్మగాని సోమ రాములు తన భార్య, పిల్లలతో ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కల్లు దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వరకు గీత వృత్తి చేస్తూ నెలకు రూ.5వేలు సంపాదించి కుటుంబాన్ని పోషించే వాడు. కొంత కాలంగా గీత వృత్తిపై ఉపాధి సన్నగిల్లింది. దీంతో సోమ రాములు వలస వెళ్లాడు. బ్రాందీ, గుడుంబా విక్రయాలు ఎక్కువ కావడంతో కల్లుకు గిరాకీ తగ్గి వలస వెళ్లాడని పక్కవారు తెలిపారు. సంవత్సరంలో ముఖ్యమైన పండుగల సమయంలో పాలకుర్తికి వస్తుంటాడు. ఈయనకు వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు ఏమీ లేవు.
కాలం కాలేదు.. కరువొచ్చింది.. చేసేందుకు చేతినిండా పనిలేదు.. పూట గడవడం.. పిల్లలను సాకడం భారమైంది.. బతుకుబండి నడిపించాలి.. దూరమైనా పని దొరికినకాడికే పోవాలంటూ పల్లె జనం పట్నంబాట పట్టారు.. వలసలు నివారించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టినా పనులు పూర్తిగా సాగడం లేదు.. ఇటు వర్షాలు లేక పంటలు పండలేదు.. సాగు భూములు బీళ్లుగా మారాయి.. గ్రామాల్లో చేయడానికి పనులు లేక రైతులు, గిరిజనులు, కూలీలు నగరాలకు బెలైల్లారు.. తాపీమేస్త్రీలు.. వంటమనుషులు, గుమస్తాలుగా చేరుతున్నారు.. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంతో పల్లెలు, తండాలు బోసిపోతున్నాయి.
అక్కడి నుంచి ఇక్కడికి...
కాజీపేట రూరల్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆదివాసీలు బతుకు దెరువు కోసం కాజీపేటకు వలస వచ్చారు. కుటుంబ సభ్యులంతా వంట సామగ్రితో సహా గురువారం నాగ్‌పూర్ ప్యాసింజర్‌కు దిగారు. జంక్షన్ ముందు మూటలతో గుంపులు గుంపులుగా సేద తీరుతున్నారు. ‘సాక్షి’ వారిని పలకరించగా.. తాము నాగ్‌పూర్(చంద్రాపూర్) వద్ద తాప్సి ఆదివాసీలతండాకు చెందిన వారమని తెలిపారు. పని కోసం ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళతామన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి రైళ్లో డోర్నకల్‌కు వెళుతున్నట్లు వారు వివరించారు.
మిర్చి ఏరేందుకు వచ్చాం
మిర్చి ఏరడానికి నాగ్‌పూర్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ పని అయిపోయక వేరే పనికి వెళతాం. రెండు నెలలపాటు తాము ఇక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ఉంటాం. తర్వాత తమ తండాకు వెళతాం. కొన్ని రోజులు ఉండి మళ్లీ పనికోసం వెతుకుతాం. - గౌటం రాజేంద్ర, ఆదివాసీ
మహబూబాబాద్ : మండలంలో ఉపాధి పనులు లేకపోవడంతో దాదాపు 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నాతండాలో 30, గుండ్రాళ్లగడ్డతండాలో 10 కుటుంబాలు వలస వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
కస్నాతండాలో...
తండాకు చెందిన బానోత్ కిషన్, అనిత దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తండాలో కిషన్‌కు 30 గుంటల భూమి ఉంది. దానిని సాగు చేస్తూ ఖాళీగా ఉన్నసమయంలో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరువు వల్ల పంటలు పండక కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో ఆ దంపతులు ఏడేళ్ల కుమారుడు చరణ్, మూడేళ్ల కుమార్తె స్వప్నను ఇంటి వద్దే వదిలి పట్నంబాట పట్టారు. హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను ఇంటికి పంపిస్తున్నారు. పిల్లల ఆలనా పాలన కిషన్ తల్లిదండ్రులు బీల్యా, కేలి చూసుకుంటున్నారు. చరణ్‌ను మానుకోటలోని ప్రభుత్వ హాస్టల్‌లో చదివిస్తుండగా.. కుమార్తె మాత్రం ఇంటి వద్దే ఉంటుంది.
అదే తండాలో...
తండాకు చెందిన లూనావత్ మంగ్యా, బుజ్జికి 2 ఎకరాల భూమి ఉంది. కరువు మూలంగా పంటలు పండక హైదరాబాద్ వెళ్లిపోయారు. వారితోపాటు వారి ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నెలకోసారి తండాకు వచ్చి భూమి, ఇల్లు చూసుకొని వెళుతున్నట్లు తండావాసులు తెలిపారు.
కురవిలో 20...
కురవి : మండల కేంద్రం శివారులోని తులిస్యాతండా, కీమ్యాతండాకు చెందిన సుమారు 20 కుటుంబాలకు చెందిన కూలీలు వలసబాట పట్టారు. ఉపాధిహామీ పథకంలో పనులు లేకపోవడంతో హైదరాబాద్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుని బతికేందుకు ఇళ్లకు తాళాలు వేసుకుని తమ పిల్లాపాపలతో కలిసి వలస వెళ్లిపోయారు. కీమ్యాతండాకు చెందిన బోడ భద్రి, బోడ నరేష్, బోడ కిషన్, బోడ సీతారాం, బానోత్ వీరన్న, బానోత్ పరమేశ్, తేజావత్ శారద కుటుంబాలతోపాటు మరికొన్ని కుటుంబాలు సైతం వలస వెళ్లాయి. కురవి శివారు తండాలే కాకుండా మండలంలోని మరిన్ని గ్రామాల శివారు తండాల ప్రజలు పనులు లేకపోవడం వల్ల బతుకుదెరువు కోసం వలస వెళ్లిపోయారు.
ఏజెన్సీ జనం...
ములుగు/మంగపేట : నియోజకవర్గంలోని ములుగు, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పనులు లేక ప్రజలు వలస వెళుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా, కంపెనీల్లో కూలీలుగా, హాస్టళ్లలో వంట పనికి చేరుతున్నారు. వలసలతో ములుగు మండలం పత్తిపల్లి శివారు కొడిశలకుంట పూర్తిగా ఖాళీ అయింది. ఊరి జనాభా 120 ఉంటే.. ప్రస్తుతం 60 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ పరిశ్రమ మూతపడడంతో పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది కార్మికులు, వ్యాపారులు ఉపాధి లేక వలస పోతున్నారు.
ప్రతి వ్యక్తికీ వంద రోజుల పని కల్పించాలి. మార్చి 31 వరకు 75 శాతం పని దినాలు కల్పించకపోతే చర్యలు తప్పవు. - కలెక్టర్