ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు | Collector Ayesha Tells Don't Migrate Will Provide Employment | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు

Published Fri, Dec 6 2019 8:21 AM | Last Updated on Fri, Dec 6 2019 8:21 AM

Collector Ayesha Tells Don't Migrate Will Provide Employment - Sakshi

చైతన్యనగర్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌ ఆయేషా, అధికారులు

సాక్షి, పెద్దేముల్‌: చెంచు కుటుంబాలు వలస వెళొద్దని గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ అన్నారు. గురువారం పెద్దేముల్‌ మండలంలోని చైతన్యనగర్‌ గ్రామంలో  కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్, జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి కోటయ్య, పీఓ ఐటీడీఏ (శ్రీశైలం), పీఓ డాక్టర్‌ వెంకటయ్యతో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ పర్యటించారు. ఇటీవల గ్రామంలో నుంచి చెంచు కుటుంబాలు  కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాకు బతుకు దెరువుకోసం వెళ్లారు. శివ అనే నాలుగు సంవత్సరాల బాబు చదువుకోవడం లేదని బీజాపూర్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టికి వచ్చింది. దీంతో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆయా కుటుంబాలను గ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ ఆయేషా గ్రామంలోని చెంచు కుటుంబాలను కలిశారు. చైతన్యనగర్‌ గ్రామంలో చెంచుకుటుంబాలు ఎన్ని ఉన్నాయనే విషయమై ఆర్డీఓ వేణుమాధవరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్లల వివరాలను సేకరించి పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.  

స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం.. 
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలోనుంచి చెంచు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లవద్దని కోరారు. తల్లిదండ్రులు గ్రామంలోనుంచి ఉపాధి కోసం వలస వెళితే పిల్లల చదువులు సాగవని అన్నారు. గ్రామంలో వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్న భూములను ప్రభుత్వం చదును చేస్తుందని అన్నారు. బడీడు పిల్లలకు ఎలాంటి పనులు చెప్పరాదని అన్నారు. పిల్లలను చదివిస్తేనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయని అన్నారు. గ్రామం లోని కుటుంబాలకు ఉపాధిహమీ పథకం ద్వారా 180 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తామని అన్నారు. గతంలో గ్రామానికి అధిక సంఖ్యలో నిధులు మంజూరయ్యాయని అయితే గ్రామ ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో గ్రామాభివృద్ధి జరగడం లేదన్నారు. మహిళలకు, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామంలో 20 కుటుంబాలకు భూములను పంపిణీ చేసి పాసుబుక్‌లను సైతం జారీచేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ చైతన్యనగర్‌లో చైతన్యం మాత్రం రావడం లేదన్నారు. గ్రామంలో నుంచి ప్రజలు వలసలు వెళ్లడం తగ్గించుకుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. చెంచు కుటుంబాలకు గిరివికాసం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించనుందన్నారు. బాండేడ్‌ లేబర్‌ యాక్టు ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం గ్రామంలో ఎన్‌సీఎల్‌పీ కేంద్రం నిర్వహించి విద్యార్థులు చదువుకునేలా చేస్తామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.

గ్రామంలో చెంచు కుటుంబాలకు విద్యుత్‌ సరఫరా 100 యూనిట్‌లలోపు వినియోగిస్తే ఉచితంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందని బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని తెలిపారు. కార్మిక శాఖ అధికారులు త్వరలో గ్రామానికి వచ్చి లేబర్‌ కార్డులను జారీచేస్తారని ఈ కార్డులు పొందినవారికి పిల్లల పెళ్లిళ్లకు రూ.30 వేలు, కాన్పుల సమయంలో మరో రూ.30 వేల చొప్పున అందించడం జరుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తే రూ.లక్ష అందుతోందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరా>రు. గ్రామంలోనే ఉపాధి పొందేందుకు గేదెలు, ఆవులు అందించాలి. స్వయం ఉపాధి కోసం రుణాలను అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి ఆర్డీఓ వేణుమాధవరావు, ఎన్‌సీఎల్‌పీ ప్రాజెక్టు అధికారి హ్మన్మంత్‌రావు, రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్, ఎంపీడీఓ రత్నమ్మ,సర్పంచ్‌ లలిత, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement